గ్రేటర్ ఎన్నికలు ముగిసినా.. మేయర్ పీఠంపై పీటముడి పడిపోయింది. ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నా తీసుకోవడానికి టీఆర్ఎస్ రెడీగా లేదు. దీంతో ప్లాన్ బీ అమలు చేసే వ్యూహంలో టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ ఇదే అంశంపై ఫామ్‌హౌస్‌లో వ్యూహరచన చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి.. ఎందుకో కానీ.. తమ కార్పొరేటర్లపై టీఆర్ఎస్ కన్ను పడిందని అనుమానిస్తున్నారు. బీజేపీ తరపున గెలిచిన కొంత మందిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన రెబల్ నేతలు ఉన్నారు. సొంత పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో వారు బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారు.
వారిని ఆకర్షించడం ఈజీ. టీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందన్న అనుమానం బీజేపీలో ప్రారంభమయింది. తమ కార్పొరేటర్లను కొనేందుకే… మేయర్ ఎన్నికలకు జాప్యం చేస్తున్నారని బండి సంజయ్ అనుమానిస్తున్నారు. అందుకే.. ఆయన చురుగ్గా స్పందిస్తున్నారు. కార్పొరేటర్లందరినీ తీసుకుని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని స్ఫష్టం చేశారు. అయితే బీజేపీ జోలికి పోయేంత సాహసం కేసీఆర్ చేయరనే అంచనా రాజకీయవర్గాల్లో ఉంది.
ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే.. బీజేపీని మించిన పార్టీ లేదు. తాజాగాలో బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. అందుకే.. ముందు జాగ్రత్తగా బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. లేకపోతే.. ఈ కారణం చెప్పి.. టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.