తెలంగాణ ప్రదేస్ కాంగ్రెస్ కమిటీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డిపై అన్ని వైపుల నుంచి ఎటాక్ కొనసాగుతోంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కడం ఇష్టం లేని కొన్ని వర్గాలు.., అధికార పార్టీ.. కొన్ని మీడియా సంస్థలు.. పాత కేసులు.. వివాదాల్ని అదే పనిగా హైలెట్ చేస్తున్నాయి. అది వారి రాజకీయం అనుకోవచ్చు. అయితే.. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయనపై ఎటాక్ జరుగుతోంది. సందర్భం లేకపోయినా మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ సమావేశాల సారాంశాన్ని వివరించడానికి ఏర్పాటుచేసిన సమావేశంలో “పొట్టొడు.. హడావుడి చేస్తూంటాడు” అంటూ ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వకుండా.. కాంగ్రెస్ హైకమాండ్‌పై అన్ని రకాల ఒత్తిళ్లు పెట్టేలా.. కొంత మంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పేర్ని నాని రేవంత్ అంశాన్నిప్రస్తావించారని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ నేతలు.. ఈ అంశంలో వారితో సమన్వయం చేసుకుంటున్నారని అంటున్నారు. పేర్ని నాని మాటలను.. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొంత మంది వైరల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీల నుంచి కూడా.. రేవంత్ కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడిపెంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం తెలిసిందో లేకపోతే.. రేవంత్ ను వ్యక్తిగతంగా విమర్శించారని ఫీలయ్యారేమో కానీ.. రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో కొంత మంది .. సోషల్ మీడియాలో పేర్ని నానిని బండ బూతులు తిడుతూ వీడియోలు అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. వీటిని రేవంత్ సోషల్ మీడియా టీం వైరల్ చేస్తోంది. ఇప్పటికే రేవంత్ టార్గెట్‌గా చాలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో ఏపీ నుంచి కూడా కొన్ని నడుస్తున్నాయన్న చర్చ ప్రారంభమయింది. మొత్తానికి పేర్ని నాని తనకు సంబంధం లేకపోయినా… ఓ రాజకీయ తుట్టెను కదిలించారు. దానికి పూర్వపరాలేమిటో మెల్ల మెల్లగా బయటకు వచ్చే చాన్సుంది.