తలైవా రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇక దళపతిపై అందరి దృష్టి పడింది. కొద్ది రోజుల క్రితం విజయ్ తండ్రి ఓ పార్టీని రిజిస్టర్ చేయించినప్పుడు… తమిళనాడులో రాజకీయ కలకలం ప్రారంభమయింది. అయితే.. విజయ్ అప్పుడేమనుకున్నారో కానీ.. ఆ పార్టీతో తనకు సంబంధం లేదని ప్రకటించేశారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ హఠాత్తుగా ఫామ్‌హౌస్‌లో తన అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. మంచి రోజు వస్తోందని చెప్పారు. తొందరపడి ఇతర పార్టీల్లో చేరొద్దని కూడా.. సూచించారు. దీంతో.. విజయ్ అభిమానుల్లో జోష్ ప్రారంభమయింది.
దళపతి విజయ్‌కి రాజకీయ ఆశలు.. ఆశయాలు ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రకటనలు చేస్తూంటారు. ఉద్యమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారు. జల్లికట్టుతో పాటు వివిధ కావేరీ తరహా ఆందోళనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారు. సీనియర్లు కాకుండా.. ప్రస్తుతం తమిళంలో ఉన్న టాప్ స్టార్లు ఇద్దరు అజిత్, విజయ్. విజయ్‌కు తమిళనాట గ్రామగ్రామానా అభిమాన సంఘాలు ఉన్నాయి. పైగా ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ వైపు నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన సినిమాలు బీజేపీని టార్గెట్ చేసినట్లుగా ఉంటాయని చెబుతారు. అందుకే.. ఎప్పుడూ విజయ్ అని చెప్పుకునే ఆయన కొన్ని వివాదాల తర్వాత జోసెఫ్ విజయ్ అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఆయన మనసులో రాజకీయాల్లోకి రావాలనే పట్టుదల మాత్రం ఉందని తమిళనాట గట్టిగా నమ్ముతున్నారు.
జయలలిత, కరుణానిధి లేని తమిళనాడు రాజకీయాల్లో ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు సినీ తారలు రెడీ అవుతున్నారు. తమిళనాడులో ప్రస్తుతం శాసనసభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. డీఎంకే తరపున స్టాలిన్ తమిళనాడు మొత్తం క్రేజ్ ఉన్న నేతగా నిలబడగా.. ఆయనకు పోటీగా.. నిలబడే ఇమేజ్ ఉన్న నేత కరవయ్యారు. ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు తారలు బయటకు వస్తున్నారు. రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు విజయ్ కూడా రంగంలోకి దిగితే… తమిళ నాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.