పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం మమతా బెనర్జీ కోసం బెంగాల్లో పని చేస్తున్నారు. ఆయన వ్యూహాలు ఏమీ వర్కవుట్ కావడం లేదని.. బీజేపీలోకి వెల్లువలా వెళ్తున్న చేరికలే నిరూపిస్తున్నాయి. పీకే వ్యూహం అంతా ఆన్ లైన్ వేదికగానే నడుస్తుంది. తాను ఎంచుకున్న పార్టీకి ప్లస్ పాయింట్ల కన్నా.. ఆ పార్టీకి ప్రత్యర్థి పార్టీపై కుల, మత, ప్రాంత పరంగా.. విద్వేషాలు రెచ్చగొట్టడంతోనే ఆయన వ్యూహం ఉంటుంది. ప్రస్తుతం మమతా బెనర్జీ కోసం బెంగాల్లో మకాం వేసి మరీ పని చేస్తున్న పీకే.. ఆ విషయంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఏపీలో జగన్‌కు అమలు చేసిన వ్యూహాలే.. అక్కడా పాటిస్తున్నారు. కానీ.. అక్కడా ఇక్కడా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ముందు అన్నీ తేలిపోతున్నాయి.
దీంతో ప్రశాంత్ కిషోర్ తన క్రెడిబులిటీ నిలబెట్టుకోవడానికో.. మరో కారణమో.. కానీ.. అమిత్ షాకే సవాల్ విసిరేశారు. బెంగాల్లో బీజేపీ మూడు అంకెల సీట్లు..అంటే వంద సీట్లు గెలుచుకుంటే.. తాను ట్విట్టర్‌ను వదిలేస్తానని సవాల్ చేశారు. పీకే సవాల్ చూసి.. తృణమూల్ నేతలు కూడా బిత్తర పోయారు. రాజకీయ సన్యాసమో.. లేకపోతే.. రాజకీయ స్ట్రాటజిస్ట్‌గా రిటైర్మెంట్ తీసుకుంటాననో.. ఏదో ఒకటి కాస్త గట్టిగా ఉండేది చెబితే.. ప్రజలు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది అయితే.. అదేదో గొప్ప త్యాగం అయినట్లు.. ట్విట్టర్ అకౌంట్‌ను వదిలేస్తానని చెప్పడం ఏమిటో… దీదీ పార్టీ నేతలకూ మింగుడు పడటం లేదు.
ఇటీవల పర్యనటలో బీజేపీ 200 సీట్లు సాధిస్తుందంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా బెంగాల్లో ఉన్నంత వరకూ ఎలాంటి మాటలు మాట్లాడని పీకే ఆయన వెళ్లిపోయిన తర్వాత మాత్రం సవాళ్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ సారి ప్రశాంత్ కిషోర్ పని తీరుకు అసలైన సవాల్ ఏర్పడింది. ఓ వైపు ఆయన కారణంగా తృణమూల్ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు. వారంతా బీజేపీలో చేరుతున్నారు. మరో వైపు ఎంఐఎం సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. దీదీకి మళ్లీ పీఠం దక్కేలా చేయకపోతే.. పీకేకి నమ్మడం తగ్గిపోతుంది.