దేశంలో జమిలీ ఎన్నికలపై చర్చ అంతకంతకూ పెరుగుతోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి జమిలీ ఎన్నికల అవసరం గురించి గట్టిగా చెప్పిన తర్వాత రాజకీయ పార్టీల్లో దీనిపై మరింత చర్చ జరుగుతోంది. అధికారంలో లేని వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని సహజంగానే వస్తూంటారు. దాంతో వారు ఆసక్తిగానే ఉన్నారు. కానీ అధికారం ఇంకా మిగిలిన ఉన్న వాళ్లు మాత్రం జమిలీ రాదనే అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు., కేంద్రం చాలా సీరియస్గా జమిలీ ఎన్నికల గురించి చర్చిస్తోందన్న ప్రచారం ఊపందుకుంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా.. ఈ అంశంపై ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని.. పార్లమెంట్లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించేస్తామని ప్రకటించింది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఈ మేరకు ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీ ఒక దేశం – ఒకే ఎన్నికలు అనే విధానాన్ని తేవాలని పట్టుదలగా ఉంది. అందు కోసం… ఓ ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తోంది. కరోనా కారణంగా ఆ ప్లాన్లను వాయిదా వేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని.. వెనుకడుగు వేసే అవకాశం కూడా లేదన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయింది. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ప్రతి ఒక్క ఎన్నికకు ఒకే సారి ఎన్నిక జరగాలనేది మోదీ అభిలాష. అలా జరిగితే.. మళ్లీ మళ్లీ ఎన్నికలన్న ప్రస్తావన రాదని.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చని చెబుతున్నారు.
కానీ ఇందులో మౌలికమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే లా కమిషన్ వేసి.. దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే.. రాజ్యాంగ సవరణ సులువే. అందుకే.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈసీ స్పందన కూడా అందులో భాగమేనని అంటున్నారు.