ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రం మొత్తం ఒకలా.. సొంత నియోజకవర్గం పులివెందులను మరోలా చూస్తున్నారు. పులివెందుల అభివృద్దికి ఎప్పటికప్పుడు వందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కనీసం రోడ్ల మరమ్మత్తులకు నిధుల్లేని పరిస్థితి ఉంది. తాజాగా.. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సొంత నియోజకవర్గానికి వెళ్తున్న సీఎం.. వెళ్లే ముందు రూ. 633 కోట్లను పులివెందులకు విడుదల చేశారు. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం.. ఈ మేరకు జీవోలు ఇచ్చారు.
పులివెందులకు ఇలా నిధుల కేటాయింపు ప్రతి క్రిస్మస్ పండుగకూ ఉంటుంది. గత ఏడాది అంటే డిసెంబర్ 23న క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు జగన్ పులివెందుకు వెళ్తున్న సమయంలోనూ పెద్ద ఎత్తున జీవోలు విడుదల చేశారు. దాదాపుగా 30 వరకూ జీవోలు విడుదల చేశారు. అప్పట్లో కడప మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కోసం రూ. 125 కోట్లు, 100 పడకల మెంటల్ హాస్పిటల్ కోసం రూ. 40.82 కోట్లు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం రూ. 347 కోట్లు, 100 పడకల కేన్సర్ హాస్పిటల్ జీవో, కడపలో బ్యూటీఫికేషన్ కోసం రూ. 55 కోట్లు, పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ. 63 కోట్లు , పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రూ. 17.5 కోట్లు కేటాయించారు. ఇవన్నీ.. కొన్ని మాత్రమే… ఇంకా రహస్య జీవోలు.. కొన్ని… ఇతర పనుల జీవోలు కొన్ని ఉన్నాయి. అన్ని జీవోలను కలిపి… ఒకే సారి విడుదల చేశారు. ఈ పనుల మొత్తం విలువ పదమూడు వందల కోట్లు ఉంటుంది.
ఆ తర్వాత జనవరిలో పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ నెలాఖరులో పులివెందుల నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన జగన్.. కనీసం రూ. 300 కోట్లకుపైగా విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు .. పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ.50 కోట్లు…. పులివెందులలో కొత్త ఫైర్ స్టేషన్ బిల్డింగ్… పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్ ఇలా చెప్పుకుటూ పోతే.. పులివెందులలో అడుగడుగునా జగన్ అభివృద్ధి కనిపించేలా పనులు మంజూరు చేశారు.
ఇవి మాత్రమే కాదు… పులివెందులలో మెట్రో స్థాయిలో మిని శిల్పారామం, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్ … జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటు.. అలాగే… భారీ మాల్ మల్టిప్లెక్స్లను పులివెందులలో నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఇవన్నీ గత పద్దెనిమిది నెలల కాలంలో.. జగన్ ఆదేశించిన అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్క పులివెందుల కోసమే. అయితే పనులు ఎన్ని జరుగుతున్నాయన్నదానిపై మాత్రం ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంలేదు. ఆ పనుల పరిస్థితి ఏమిటో కూడా చెప్పడం లేదు. బహుశా.. అక్కడ జోరుగా సాగుతున్న పనులు చూపిస్తే.. ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డిమాండ్లు చేస్తారని సైలెంట్ గా ఉన్నారేమో క్లారిటీ లేదు. కానీ.. రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రతిపాదనల్లో ఉన్నట్లే.. పులివెందుల్లోనూ ఇంకా ప్రతిపాదనల్లోనూ పనులు ఉన్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.