కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి తన సొంత ఆదాయం.. రూ. కోటిని రైతులకు పంపిణీ చేశారు. దానికి కారణం.. నివర్ తుపాను వల్ల.. రైతాంగం తీవ్రంగా నష్టపోవడమే. నివర్ తుపాను దెబ్బకు కడప జిల్లాలోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రొద్దుటూరులోనూ అంతే. రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి.. తన సొంత డబ్బును కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. అయితే ఆయన అందరి లాంటి రాజకీయ నాయకుడుకాదు. ఎలా సంపాదించినా సరే… రూ. కోటిని రైతులకు పంపిణీ చేసేశారు. ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. నష్టపోయిన రైతులకు సాయం అందించాడు.
రాచమల్లు ప్రసాదరెడ్డి ఔదార్యం రైతులకు నచ్చిందికానీ.. వైసీపీ నేతలకు.. మింగుడు పడటం లేదు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల రైతులు.. వైసీపీ ఎమ్మెల్యేల వైపు ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఇస్తామని చెప్పింది. ఆ మొత్తం.. రూ. 700 కోట్లకు అటూఇటుగా ఉంటుందని తేలింది. రైతులు నష్టపోయిన పంట విలువ రూ. పదిహేను వేల కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. కేంద్రానికి పంపే నివేదికల్లోనూ దాదాపుగా ఇంతేమొత్తం ఉంది. అంత భారీ నష్టం జరిగితే.. రూ. ఏడువందల కోట్లు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీగా ప్రకటిస్తే.. ఒక్కో రైతులు రూ. వెయ్యిఅయినా అందడం కష్టమే. అందుకే.. ప్రభుత్వం ఎలాగూ సాయం చేయదు కాబట్టి.. వైసీపీ ఎమ్మెల్యేలు.. ప్రసాదరెడ్డిలా సాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఒక్క కడప జిల్లాలోనే కాదు.. రాయలసీమతో పాటు.. గోదావరి జిల్లాల వరకూ నివర్ తుపాన్ ప్రభావం కనిపించింది. గోదావరి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పంట నష్టపోయారు. వీరందర్నీ ఆదుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు ఎకరానికి రూ. 30వేలు ఇవ్వాలని టీడీపీ, జనసేనలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం.. నిజాయితీగా పంట నష్టం వేశామని.. చెబుతూ.. ఇన్పుట్ సబ్సిడీని మాత్రమే ఇస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ నిజాయితీ కన్నా… వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి నిజాయితీ ఎక్కువగా ఉన్నట్లుగా.. తాజాగా తేలింది. ఆయన ఇచ్చిన సాయం.. ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీకి అదనం.కోవిడ్ వారియర్స్‌కు జీతాలివ్వడం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన ఘటన మరవక ముందే.. ప్రసాదరెడ్డి వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమయింది.