ఆంధ్రప్రదేశ్ తదుపరి చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్‌ను ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం సీసీఎల్ఏగా ఉన్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఈ నెల 31తో రిటైర్ కానున్నారు. ఇప్పటికే కేంద్రం ఆమెకు రెండు విడుతలుగా పొడిగింపు ఇచ్చింది. ఇక ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. అయితే.. జగన్మోహన్ రెడ్డి ఆమె సేవలను ఇంకా కొనసాగించాలని నిర్ణయించారు. అందుకే… 31వ తేదీన రిటైరైనయిప్పటికీ.. ఆమెను జగన్ ప్రిన్సిపల్ అడ్వయిజర్‌గా నియమించాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర కొనసాగనుంది.
ఇక జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని తన కెరీర్ ను చాలా వరకు కోల్పోయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి క్యాడర్ ను మార్చేసుకుని ఏపీకి రావడంతో.. ఆమెకు పురపాలక శాఖ కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. ఏపీలో జగన్ గెలిచినప్పటి నుండి… తెలంగాణలో ఆమె విధులు నిర్వహించడం లేదు. మొదట డిప్యూటేషన్‌పై ఏపీకి రావాలని ప్రయత్నించారు. కానీ నిబంధనలు అంగీకరించకపోవడంతో.. చివరికి క్యాడర్ మార్పు కోసం ప్రయత్నించి.. క్యాట్‌లో పిటిషన్ వేసి వాదించి .. అనుకూలమైన నిర్ణయం తీసుకుని వచ్చి ఏపీ సర్వీస్‌లో చేరారు. చీఫ్ సెక్రటరీగా ఎవరిని నియమించాలన్నదానిపై జగన్మోహన్ రెడ్డి క్యాంప్ చివరివరకు తర్జనభర్జన పడింది. ఓ దశలో ఆదిత్య నాథ్ దాస్ వెనుకబడ్డారు. ఆయనను సీసీఎల్ఏ పదవి నుంచి తప్పించారు.
సాధారణంగా సీఎస్ చాయిస్ ఉన్న వారికే ముఖ్యమంత్రులు సీసీఎల్‌గా నియమిస్తారు. అయితే ఆదిత్యనాథ్ ను ఆ పదవి నుంచి తప్పించడంతో ఆయన సీఎస్ చాన్స్ కోల్పోయారని అనుకున్నారు. ఏం జరిగిందో కానీ.. మూడు రోజుల్లోనే మళ్లీ ఆదిత్యనాథ్ దాస్ ను సీసీఎల్ఏగా నియమించారు. దాంతో ఆయనే నెక్ట్స్ సీఎస్ అని క్లారిటీ వచ్చినట్లయింది. వైఎస్ హయాం నుంచి జలవనరుల శాఖలోనే ఆదిత్యనాథ్ దాస్ ఎక్కువ కాలం పని చేశారు. ఆయన జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అయితే హైకోర్టు ఆయన పేరును తొలగించింది. సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.