దాదాపుగా 20 ఏళ్ల నుండి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు అంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తాడంటూ కొనసాగిన రూమర్స్ కి ఎట్టకేలకు తెరపడనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ జనవరి 17వ తేదీన లాంచ్ చేయడానికి పూర్తిస్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో పాటు భారీగా పార్టీ ఆవిర్భావ సభ ఉండే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..
20 ఏళ్ల నుండి రాజకీయాలకి వస్తాడా రాడా అని కొనసాగిన సస్పెన్స్ కు దాదాపు మూడేళ్ల క్రితం స్వయంగా ముగింపు పలికాడు రజనీ. మూడేళ్ల కిందట డిసెంబర్ 31వ తేదీన రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్ ఆ తర్వాత మళ్ళీ కొంత డైలమాలో పడ్డాడు. మొన్నామధ్య రజనీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశాన్ని వాయిదా వేసుకుని, మళ్లీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని చూస్తున్నాడు అని వచ్చిన వార్తలు అభిమానుల్లో గందరగోళాన్ని కలిగించాయి. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు తన పార్టీని త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రకటిస్తానని రజిని వారికి హామీ ఇచ్చారు.
తాజా సమాచారం మేరకు, జనవరిలో పార్టీని లాంచ్ చేయడం, పార్టీ పేరు ప్రకటించడం, పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం వంటి వాటి కొరకై రజిని సన్నిహితులు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 21వ తేదీన ఎమ్జీయార్ జయంతి సందర్భంగా పార్టీని లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 31వ తేదీన వెలువడే అవకాశం ఉంది.
అయితే కేవలం బీజేపీకి మేలు చేసే ఉద్దేశంతోనే పార్టీ పెడుతున్నాడు అన్న ఆరోపణల నేపథ్యంలో రాజకీయాల్లో ఎంత వరకు రజనీ విజయవంతం అవుతాడు అన్నది వేచి చూడాలి.