గ్రేటర్ ఎన్నికలు ముగిసి రోజులు గడిచిపోతున్నా… ఇంత వరకూ గెలిచిన కార్పొరేటర్లను తెలంగాణ ఎన్నికల సంఘం నోటిఫై చేయలేదు. దీంతో భారతీయ జనతా పార్టీ.. ఏదో కుట్ర జరుగుతోందని అనుమానిస్తోంది. తక్షణం.. గెలిచిన కార్పొరేటర్లను నోటిఫై చేయకపోతే.. కోర్టుకెళ్తామని.. ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎస్ఈసీ పార్థసారధిని కలిసి వెంటనే నోటిఫై చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చారు. మామూలుగా టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చి ఉంటే.. ఈ పాటికి కొత్త మేయర్ కొలువు దీరిఉండేవారు. కానీ.. ప్రస్తుత పాలక వర్గానికి ఫిబ్రవరి వరకూ గడువు ఉందంటూ.. ఎన్నికైన కార్పొరేటర్లను ఖాళీగా ఉంచుతున్నారు.
దీంతో… కేసీఆర్ తెర వెనుక ఏదో ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అనుమానానికి బీజేపీ నేతలు వస్తున్నారు. అందుకే.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతగా సమయం ఉందనుకుంటే… ముందుగా ఎన్నికలు ఎందుకు నిర్వహించారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ను కూడా కలుస్తామని ప్రకటించారు. సాధారణంగా ముందస్తుగా ఎన్నికలు జరిగి.. మ్యాండేట్ వ్యతిరేకంగా వచ్చిందని తెలిస్తే.. ఆ ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలుగుతుంది. అయితే.. గ్రేటర్లో మాత్రం.. అలాంటి ఆలోచన చేయడం లేదు.
అయితే గ్రేటర్ మేయర్ పీఠాన్ని వదులుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని.. ఎలాగైనా పీఠం దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడమో.. లేదా.. మళ్లీ ఎన్నికలు పెట్టే ఆలోచనలోనో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఎన్నికైన కార్పొరేటర్లను వీలైనంత త్వరగా నోటిఫై చేయించాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప.. ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.