ఈమధ్య ఆహాలో డబ్బింగు సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆహాని డబ్బింగ్ ఓటీటీ అంటూ.. కామెంట్లు విసురుతున్నారు సినీ అభిమానులు. అయితే ఆ డబ్బింగు సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య ఆహాలో విడుదలైన డబ్బింగ్ సినిమా… `బెల్ బోటమ్`. ఓ కన్నడ సినిమా ఇది. డిటెక్టీవ్ నేపథ్యంలో సాగుతుంది. నిజానికి ఈ కథ సునీల్ కి బాగా నచ్చిందట. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడట. అయితే ఇంతలోనే ఈసినిమాని `ఆహా`లోకి డబ్బింగ్ రూపంలో తీసుకొచ్చేశారు.
`ఆహా`లో తెలుగు డబ్బింగ్ బొమ్మ చూసిన వాళ్లంతా.. `ఇది తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుంది` అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సునీల్ దగ్గర కూడా కొంతమంది ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో సునీల్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడట. ఆహాలో డబ్ అయితే అయ్యింది.. రీమేక్ రైట్స్ కొనుక్కుని, కొన్ని మార్పులు చేర్పులతో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. కావాలంటే.. ఆహాలోంచి ఆసినిమాని హైడ్ చేయొచ్చన్నది సునీల్ ఆలోచన. నిజానికి బెల్ బోటెమ్ కథ సునీల్ కి బాగా సరిపోతుంది. మధ్యలో ఒకట్రెండు కామెడీ ట్రాకులు జోడించుకుంటే, మంచి ఫలితం వస్తుంది. మరి.. సునీల్ ప్రయత్నాలు ఎంత వరకూ నెరవేరతాయో చూడాలి.