ఈ లాక్ డౌన్లో దర్శకులంతా ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. షూటింగులు లేకపోవడంతో, ఇంటి పట్టున ఉండే అవకాశం కలిగింది. దాంతో పాటు కొత్త కథల్ని ఆలోచించుకొనే సమయం దక్కింది. త్రివిక్రమ్ అయితే రెండు కథల్ని సిద్ధం చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ కథకి మెరుగులు దిద్దుకుంటూనే, రెండు కొత్త కథల్ని రాసుకున్నాడని తెలుస్తోంది. అందులో ఓ కథని రామ్ తో తెరకెక్కిస్తారని కూడా అనుకున్నారు. కానీ…ఆ ప్రాజెక్టు ముందుకు జరగలేదు.
అయితే తాను రాసుకున్న కథల్లో ఒకటి.. శిష్యుడికి అందించబోతున్నార్ట. ఛలో, భీష్మ సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల… త్రివిక్రమ్ శిష్యుడే. తనకే త్రివిక్రమ్ కథ అందించబోతున్నారని, ఆ కథతో.. వెంకీ కుడుముల సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ చిత్రాన్ని హారిక హాసిని సంస్థ నిర్మించబోతోందని సమాచారం. రామ్ తో త్రివిక్రమ్ చేయాలనుకున్న కథ ఇదేనా, కాదా? అనేది మాత్రం తెలియాల్సివుంది. అదే కథని.. తన శిష్యుడితో తెరకెక్కించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటీవల రామ్ యువ దర్శకులకు కొంతమందికి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో వెంకీ కుడుముల కూడా ఉన్నాడు. సో… ఈ కాంబినేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట.