హైదరాబాద్: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ్టితో 63వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తన తండ్రికి ట్విట్టర్ ద్వారా విలక్షణంగా శుభాకాంక్షలు తెలిపారు. తన లీడర్, తన హీరో, తన స్ఫూర్తి కేసీఆరేనని, ఆయన అద్భుతమైన తండ్రి అని పేర్కొన్నారు. హ్యాపీ, హెల్తీ, వండర్ఫుల్ బర్త్‌డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌లోనే తల్లిదండ్రులతో తన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం తర్వాత తాను కేసీఆర్ కాళ్ళకు నమస్కరిస్తున్న ఫోటోను, కేసీఆర్‌తో తన కుమార్తె, కుమారుడు ఉన్న ఫోటోలను కూడా జతచేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో యువకుడిగా ఉన్న కేసీఆర్, నిండైన జుట్టుతో, హిప్పీ క్రాఫ్‌లో ఫ్యాషనబుల్‌గా, వెరైటీగా కనిపిస్తున్నారు.