బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జోరు మీద ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని విరివిగా చేర్చుకుంటోంది. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు ఇప్పటి వరకూ బీజేపీ తృణమూల్‌పై చేస్తున్న ప్రధానమైన ఆరోపణల మకిలీ కూడా తన పార్టీకి రాసుకుంటోంది. కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా.. తృణమూల్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. శారదా చిట్ ఫండ్ స్కాంలో.. రూ. పదివేల కోట్లు చేతులు మారాయని.. దీని వెనుక తృణమూల్ నేతలున్నారనేది బీజేపీ ఆరోపణ. సీబీఐ కూడా విచారణ చేసింది. అప్పట్లో.. శారదా సంస్థ నుంచి డబ్బులు వసూలు చేశారని తృణమూల్ నేతలపై స్టింగ్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ వెబ్ సైట్లలో అవి ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తొలగించారు. దానికి కారణం శారదా స్కాంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ నేతలంతా బీజేపీలో చేరిపోవడమే.
బెంగాల్లో శారదా గ్రూపునకు చెందిన చిట్‌ఫండ్ సంస్థలో పది లక్షల మందికి పైగా ప్రజలు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఈ స్కాం నేపధ్యంగా బీజేపీ రాజకీయ పోరాటాలు ప్రారంభించింది. సహజంగా అధికారంలో ఉన్న తృణమూల్ నేతలపైనే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. శారదా కుంభకోణంలో పాత్ర ఉన్న నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ 2017లో బీజేపీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. అప్పటి నుంచి బీజేపీ బెంగాల్లో బలపడటం ప్రారంభమయింది. నిజానికి ఈ శారదా స్కాం 2013లో బబయటపడింది. తృణమూల్ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు చేయించింది. కానీ.. ఈ కేసును సుప్రీంకోర్టు ద్వారా సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది.
ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా ఉన్న ముకుల్ రాయ్, నిన్నామొన్న పార్టీలో చేరిన సువేందు అధికారి.. లాంటి వాళ్లు 2016లో నారదా న్యూస్అనే చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో డబ్బులు తీసుకుంటూ దొరికిపోయారు. వారు బీజేపీలో చేరడంతో ఆ వీడియోల్ని .. యూ ట్యూబ్ నుంచి తొలగించారు. ఈ ఇద్దరే కాదు.. శారదా స్కాంలో పేరున్న ప్రతి ఒక్క తృణమూల్ నేతను చేర్చుకోవడానికి బీజేపీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. చివరికి తన వద్ద లంచాలు తీసుకున్న నేతలందరూ బీజేపీలో చేరిపోయారని జైలు పాలైన శారదా గ్రూప్ యజమాని విమర్శించడం ప్రారంభించారు. మొత్తానికి శారదా స్కాంను బూచిగా చూపి.. పెద్ద ఎత్తున బీజేపీ చేరికల్ని ప్రోత్సహిస్తున్నట్లుగాకనిపిస్తోంది.. చివరికి ఆ స్కాంను బీజేపీకి అంటించేసుకుంటున్నారన్న సైటైర్లు తృణమూల్ నేతల నుంచి పడుతున్నాయి.