ఓ వైపు లేని దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ.. ఏపీలో మాత్రం మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రొజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ఘోరాల్లో తాజాగా.. అనంతపురం జిల్లాలో జరిగింది. ధర్మవరం మండలం బడన్నపల్లి సమీపంలో యువతిని దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన యువతి ధర్మవరం ఎస్బీఐ బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగినిగా పని చేస్తోంది. హత్యచేసి తగులబెట్టారు. ప్రతిరోజు విధుల్లో భాగంగా అనంతపురం నుంచి ధర్మవరానికి ద్విచక్ర వాహనంపై వెళ్లొచ్చే యువతిని దుండగులు కాపుకాసి దారుణంగా హత్య చేశారు.
స్నేహలత మంగళవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అనంతపుం వస్తున్నానని చెప్పింది. అయితే ఆమె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొలాల్లో మృతదేహాన్ని గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే వ్యక్తులు స్నేహలతను వేధిస్తున్నారని… నాలుగైదు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా స్నేహలత తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఘోరం జరిగింది. ఈ ఘటనపై నారా లోకేష్ స్పందించారు. బాధితురాలి తల్లి మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వివరించారు. ..
అనంతపురం ఘటనలో ఓ వైపు బిడ్డను కోల్పోయిన తల్లి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని కన్నీరు పెడుతూంటే.. మరో వైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ… సినిమా పోస్టర్లపై టీవీ చానళ్లలో చర్చలు పెట్టారు. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో విడుదలైన డర్టీ హరి సినిమా పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయని.. తక్షణం కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరారు. దానిపై ఆమె టీవీ చానళ్లతో మాట్లాడేందుకు సమయం కేటాయించారు. కానీ.. బలైనపోయిన అభాగ్యురాలి గురించి మాత్రం పట్టించుకోలేదు.