మూవీ బ్యాక్‌లాగ్‌లు పూర్తి చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకంటున్న రజనీకాంత్‌కు ఏదీ కలసి రావడం లేదు. గట్టిగా వారం రోజులు షూటింగ్ చేయగానే.. కరోనా బ్రేక్ పడింది. రజనీ నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ యూనిట్లో ఎనిమిదికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రజనీకాంత్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. 4 వారాల పాటు షూటింగ్‌కు బ్రేక్ తప్పదని నిర్మాతలైన సన్ పిక్చర్స్ ప్రకటించారు.
రజనీకాంత్ హీరోగా దర్శకుడు శివకుమార్ `అన్నాత్తే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న చిత్రీకరణ జరుగుతోంది. యూనిట్లో కొంత మంది సిబ్బందికి అనారోగ్యానికి గురి కావడంతో కరోనా టెస్టులకు వెళ్లారు. ఎనిమిది మంది పాజిటివ్ అని తేలడంతో..వెంటనే షూటింగ్ నిలిపేశారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఈలోగా అన్నాత్తేను పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు.
ప్లాన్ ప్రకారం రోజుకి 14 గంటలు లెక్కన రజనీ షూటింగ్లో పాల్గొన్నారు. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవుతుందని భావించినా…ఈలోగా యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయినట్లయింది. కరోనా కారణంగా అన్నాత్తే మూవీ షూటింగ్ ఆగిపోవడం ఇదే ప్రథమం కాదు. లాక్ డౌన్ కారణంగా ఆరేడు నెలలు షూటింగ్ ఆగిపోయింది. గ్యాప్ తర్వాత మళ్లీ ప్రారంభమైనప్పటికీ మరో అవాంతరం వచ్చిపడింది. రజనీకాంత్ కు నెగెటివ్ రావడంతో ఆయన రాజకీయాలపై ఇక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది.