ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో ఇక పన్నుల మోతమోగనుంది. కొద్ది రోజుల కిందట… ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు.. ఆ పన్నును.. ఏటేటా పెంచుకుంచూ పోవాలని నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. కేంద్రం ప్రకటించింది. పట్టణ సంస్కరణలు అమలు చేయడానికి ఏపీ సర్కార్ అంగీకరించిందని అందుకే రూ. రెండువేల ఐదు వందల కోట్ల వరకూ అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని కేంద్రం ప్రకటించింది. దీంతో… అసలు విషయం బయటపడింది.
కేంద్రం అనేక సంస్కరణలు తేవాలని నిర్ణయించింది. అందులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లాంటివి కూడా ఉన్నాయి. ఆ సంస్కరణలు తెస్తే అప్పులిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అప్పుల కోసం.. దేనికైనా రెడీ అన్నట్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వం అన్నింటినీ అమలు చేయడానికి సిద్ధమయింది. ఈ ప్రకారం.. పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలకు ఏపీ అంగీకరించింది. దీనిపై ఏపీలోని పట్టణాల్లో ఇకపై పన్నుల మోత మోగుతుంది. తాగునీరు, డ్రైనేజీ, ఆస్తులపై ప్రతి ఏటా పన్నులు పెంచాల్సి ఉంటుంది.
నిజానికి ఏపీలో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలు ఏం లేవు. విజయవాడ, విశాఖపట్టణం మాత్రమే ఓ మాదిరి నగరాలుగా ఉన్నాయి. మిగతావన్నీ.. పేరుకు పట్టణాలే కానీ ఎక్కువగా గ్రామాల లక్షణాలతోనే ఉంటాయి. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ… రాజకీయ కారణాలతో వాటిని మున్సిపాల్టీలుగా ప్రకటించేస్తున్న ప్రభుత్వాలు పన్నులు బాదేస్తున్నాయి. ఇప్పుడు అప్పుల కోసం కూడా.. పన్నుల బాదుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రజలపై మరింత భారం పడినట్లయింది.