హైదరాబాద్‌లో ఉన్న డీజీపీ గౌతం సవాంగ్ ఇంటిపై కొంత మంది డ్రోన్లు ఎగరేశారు. నాలుగైదు సార్లు అలా డ్రోన్లు ఎగుర వేయడంతో.. ఇంటికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించారని .. ఫోటోలు తీశారని అనుమానిస్తున్నారు. వెంటనే… గౌతం సవాంగ్ వ్యక్తిగత కార్యదర్శి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చి.. డ్రోన్లు ఎగుర వేసిన వారిని అదుపులోకి తీసుకునేలా చేయగలిగారు. కేసులు నమోదు చేశారో లేదో క్లారిటీలేదు కానీ.. డ్రోన్లను స్వాధీనం చేసుకుని అసలేం చిత్రీకరించారో అన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ డ్రోన్లలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డిలీట్ చేసిన సమాచారం ఏమైనా ఉంటే బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్లోనిప్రశాసన్ నగర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇళ్లు ఉంటాయి. అక్కడే ఈ ఘటన జరిగింది. గౌతం సవాంగ్ ఇంటి పక్కన.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన మరో ఐపీఎస్ అధికారి ఇల్లు ఉంది. డ్రోన్లు ఎగురవేయడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు హయాలో డీజీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఇంటిపై అప్పటి వైసీపీ నేతలు అనేక ఫిర్యాదులు చేశారు. ఆయన ఆక్రమణలకు పాల్పడ్డారంటూ.. ఫోటోలు తీసి.. ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వివరాలతో పిటిషన్లు కూడా వేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అధికారులు కూడా భాగమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏం జరిగినా.. గౌతం సవాంగ్ లాంటి ఉన్నతాధికారులకు టెన్షన్ తప్పడం లేదు.
ప్రస్తుతం డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తి నేపధ్యం తెలుసుకునే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. ఏపీ పోలీసులు కూడా..ఈ అంశంపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఇంటికి సంబంధించిన అంశాలు ఏమైనా సేకరించారా…అలా సేకరించిన సమాచారంతో వారేం చేస్తారు..? నక్సలైట్ల హిట్‌లిస్ట్ లో పెట్టుకుని.. వారేమైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా.. అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైతే.. సంచలన విషయాలేమీ బయటకు రాలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.