తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువగా బయటకు రారు. ఆయన ఫామ్‌హౌస్‌లోనో.. ప్రగతి భవన్‌లోనో ఉంటారు. తనకు అత్యంత ముఖ్యం అయిన కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ నేతలు… ఈ అంశాన్ని మెల్లగా చర్చనీయాంశం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. పీవీ నరసింహారావు వర్థంతి కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొనకపోవడంతో.. ఈ అంశంపైనే ఘాటుగా విమర్శలు చేయడం ప్రారంభించారు. గ్రేటర్ ఎన్నికల కోసమే పీవీ జయంతి పేరుతో హడావుడి చేశారని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి బయటకు రావడం లేదని..కేసీఆర్ ఎక్కడ ఉన్నారో.. ఎక్కడ పన్నారో తెలియట్లేదని సంజయ్ విమర్శించడం ప్రారంభించారు.
గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ.. కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని చర్చనీయాంశం చేసింది. హైదరాబాద్‌కు వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కనీసం కేసీఆర్ పలకరింపులకు రాలేదని కానీ.. ఎన్నికలు రాగానే ఓట్లు కోసం వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆయన ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి అని అనడం ప్రారంభించారు. అయితే కేసీఆర్ ఇలాంటి వాటిని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. భారతీయ జనతా పార్టీ నేతలు.. పని చేయని సీఎం అనే ముద్ర వేయడానికి పకడ్బందీ ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ నాలుగు రోజుల క్రితం… కేంద్ర మంత్రి గడ్కరీతో జరిగిన ఓ ఆన్ లైన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ కేసీఆర్ పాల్గొనలేదు. యథాలాపంగా అన్నారో.. నిజమో కానీ… మంత్రి ప్రశాంత్ రెడ్డి.. కేసీఆర్ అస్వస్థతగా ఉన్నారని.. అందుకే పాల్గొనలేదని వివరణ ఇచ్చారు. వెంటనే గడ్కరీ..అయితే కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో కేసీఆర్‌కు ఏమయింది అని.. సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ అనారోగ్య కారణం కేవలం.. ఆ కార్యక్రమాన్ని స్కిప్ చేయడానికేనని కొంత మంది టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలోనూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇలాంటి కారణం చెప్పడంతో .. అందరూ లైట్ తీసుకున్నారు.