అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఇప్పుడల్లా న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్ చేసింది. వాస్తవానికి ఆ ఆస్తులను హైకోర్టు పర్యవేక్షణలో వేలం వేస్తూ.. వచ్చిన డబ్బును.. డిపాజిటర్లకు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలం వేసిన డబ్బుతో .. ఈ ప్రభుత్వం దాదాపుగా 265 కోట్లను డిపాజిట్ దారులకు చెల్లించారు. ఇటీవలే ఏపీ సర్కార్.. మిగతా ఆస్తులను వేలం వేసి.. ఆ సొమ్మును డిపాజిట్ దారులకు చెల్లిస్తామని హైకోర్టును కోరింది. దానికి హైకోర్టు అంగీకరించింది.
కానీ ఈ లోపు ఈడీ ఆస్తులన్నింటినీ ఆటాచ్ చేయడంతో పరిస్థితి మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు వాటిని అమ్మడానికి వీలు లేకుండా పోయింది. మొత్తంగా రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలోని ఆస్తులు వీటిలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ఏపీలోని 56 ఎకరాల హాయ్లాండ్ కూడా ఉంది. అలాగే పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలు కూడా ఉన్నాయి.
గతంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం.. అలా ఇస్తే.. డిపాజిట్ దారులకు జీవితంలో న్యాయం జరగదని తిరస్కరించింది. ఎలాగోలా ఆస్తులు వేలం వేసి.. తిరిగి ఇవ్వాలని అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇంత హఠాత్తుగా ఈడీ ఎందుకు కేసు నమోదు చేసిందో.. స్పష్టత లేదు కానీ… ఆస్తులపై కన్నేసిన వారే.. వేలం వేయకుండా చేసేందుకు ఫిర్యాదు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.