రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ఖరారు చేశారనే ప్రచారం ప్రారంభమవడంతో సీనియర్ నేత వీహెచ్‌కు బీపీ పెరిగిపోతోంది. రేవంత్‌కు ఆయనకు ఎప్పుడో.. ఎక్కడో తెలియని శత్రుత్వం ఏదో ఉన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని హైకమాండ్‌కు అల్టిమేటం జారీ చేశారు. అయితే రేవంత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏమైనా డొలాయమానంలో ఉంటే… దీన్ని గొప్ప ఆఫర్‌గా భావించి… రేవంత్ నే ఖరారు చేస్తారనే సెటైర్లు కాంగ్రెస్‌లోనే పడుతున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో గ్రూపుకట్టిన వారిలో వీహెచ్ ప్రదానంగా ఉన్నారు. ఆయన సీనియర్ నేతగా తన హోదాను అనుభవిస్తున్నారు కానీ.. పార్టీకి మేలు చేసే కార్యక్రమం ఒక్కటీ కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
2014 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. నాలుగో స్థానంలో నిలిచారు. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ కూడా లైట్ తీసుకోవడం ప్రారంభించింది. మూడేళ్ల నుంచి ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో.. ఆయన తెలంగాణలోనే రచ్చ చేస్తున్నారు. ఇంతకూ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఎందుకు ఇవ్వకూడదంటే.. ఆయన వద్ద సమాధానం లేదు. విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడని.. మరొకటని .. ఆయన వద్ద అన్ని డబ్బులు ఎలా వచ్చాయో.. సీబీఐకి లేఖ రాస్తానని అంటున్నారు.
మొత్తానికి రేవంత్ ను పీసీసీ చీఫ్‌గా నియమించే ముందు.. నేతలను మానసికంగా ప్రిపేర్ చేయడంలో ఏఐసిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎవరేం చెప్పినా రేవంత్ పీసీసీ చీఫేనని.. పార్టీలో ఉంటే.. పోటీ దారులకు కొన్ని పదవులు మాత్రం దక్కుతాయన్న ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో.. ఇష్టం లేని వారు బయటకు వస్తున్నారు. ఇప్పటికి వీహెచ్, జగ్గారెడ్డి మాత్రమే.. రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు.