అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కులాన్నే ప్రధానంగా వాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుల ప్రస్తావన చేయడానికి ఏ మాత్రం సందేహపడకుండా ముందుకెళ్లిపోతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ… ఆయన రాజధాని ప్రస్తావన తీసుకు వచ్చారు. అమరావతికి రైతులు ఇచ్చిన భూములను… సీడ్ క్యాపిటల్‌గా కట్టాల్సిన భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి బయట ప్రాంతాల వారికి ఇవ్వాలనుకున్నారు. రైతులు కోర్టుకెళ్లడంతో నిలిచిపోయింది. రైతులు కోర్టుకెళ్లిన ఉద్దేశం తమకు న్యాయం చేయమనే…! కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… అక్కడ ఇంటి పట్టాలిస్తే కులాలు మారిపోతాయని కోర్టుకెళ్లారని నిర్మోహమాటంగా చెబుతున్నారు. కులాలు మారిపోతాయని ఇంటిపట్టాలివ్వొద్దంటున్నారని… అన్ని కులాలు, మతాలు కలసి ఉంటేనే సమాజమని ఆయన హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విని మొదట చాలా మందికి అర్థం కాలేదు కానీ.. కులం ముద్ర వేసే సరికి.. అది అమరావతేనని అందరికీ అర్థమైపోయింది. అమరావతిపై కులం ముద్ర వేయడానికి వైసీపీ చాలా పకడ్బందీగా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ప్రణాళికలు వేసింది. విస్తృతమైన ప్రచారం చేసింది. కానీ… అక్కడ భూములిచ్చిన వారిలో అత్యధికం..బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని… సీఎం జగన్ చెబుతున్న సామాజికవర్గం కన్నా… రెడ్లే రెండింతల వరకూ భూములిచ్చారని లెక్కలు బయటకు వచ్చాయి. అమరావతి జేఏసీ కన్వీనర్‌గా శివారెడ్డి ముందుండి పోరాడుతున్నారు.
అయిన్పపటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు అమరావతిపై అంటరాని ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కులాలు మారిపోతాయని.. అక్కడ పట్టాలివ్వడం లేదని.. అందుకు కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని చెబుతున్నారు. ఇప్పటి వరకూ అమరావతిని మార్చేందుకు అనేకానేక కారణాలను.. వైసీపీతో పాటు .. ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. చంద్రబాబు బినామీ ఆస్తుల దగ్గర్నుంచి అమరావతి మునిగిపోతుందన్న వరకూ చాలా చాలా చెప్పారు. అవినీతి ప్రచారం చేశారు. ఆ కారణాలను చెప్పి… అమరావతిని తరలించాలని అనుకున్నారు. కానీ.. ఏ ఒక్క కారణాన్ని కూడా సహేతుకంగా ప్రజల ముందు ఉంచలేకపోయారు. ఇప్పుడు కొత్తగా అదేదో అగ్ర కులస్తులు ఉండే ఊళ్లని అక్కడ ఇతర కులాల వారిని ఉండనీయడం లేదన్న ప్రచారం ప్రారంభించేశారు.
పాలకుడు… నిష్కల్మమైన మనసుతో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా.. కొంత మందిపై కక్ష చేయాలని… రాష్ట్రం కోసం భూములిచ్చారని అకారణంగా పగ పెంచుకుని లేని పోని అవాస్తవాలు.. అపోహలు ప్రచారం చేసి.. వారిపై ప్రజల్లో ఏదేదో అనుమానం రేకెత్తించాలనుకునే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చేస్తున్నారని విపక్ష నేతలు అంటున్నారు. ఇప్పటికే అమరావతి విషయంలో ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని… ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే అంటరాని ముద్ర వేస్తున్నారని… మండిపడుతున్నారు.