తాను దూర సందు లేదు కానీ ఎదుటోడికి హైవేను చూపిస్తానంటున్నాడు.. కాంగ్రెస్ నేత వీహెచ్. తనకు రెండు, మూడేళ్ల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని.. కలవలేకపోతున్నానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. దాంతో పాటు.. రేవంత్ రెడ్డి కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందని.. చెప్పుకోవడంతో పాటు… పక్క రాష్ట్రం.. ఏపీ రాజకీయాలపైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవి ఇప్పిస్తానని అంటున్నాడు. అలా ఉత్తినే అనలేదు… ఏపీలో వంగవీటి రంగా తర్వాత అంత వేవ్ పవన్ కల్యాణ్‌కు ఉందని వీహెచ్ అంటున్నారు. అందుకే.. పీసీసీ చీఫ్ పోస్ట్ ఇప్పిస్తానంటున్నారు.
సూర్యాపేటలో వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఎవరో ఆయనను పిలిచారు.. అలా పిలవడం అంటే.. తనను గొప్పగా గుర్తించినట్లే అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే అక్కడికి వెళ్లి ప్రకటనలు చేశారు. ఓ వైపు ఆయనను పార్టీ నుంచి సాగనంపడానికి పార్టీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి పైసా ప్రయోజనం లేకపోయినా.. ప్రతీ దానికి లేనిపోని రచ్చ చేస్తూ.. పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారన్న అభిప్రాయం పెరిగిపోయింది. చివరికి కొత్త ఇంచార్జ్ ఠాగూర్ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే .. కాంగ్రెస్ హైకమాండ్ నివేదిక తెప్పించుకుంది.
ఆయనపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇదంతా ఆయనకు తెలిసినా.. కాంగ్రెస్‌లో తనకు ఎంతో పలుకుబడి ఉందని.. తనను పిలిచిన వారికి చెప్పుకోవడానికి ఏకంగా పవన్ కల్యాణ్ పేరునే వాడేసుకుంటున్నారు. ముందుగా ఆయన తనకు కాంగ్రెస్ పార్టీలో చోటు ఉంటుందేమో చూసుకోవాలని.. ఆ తర్వాత జనసేన సంగతి చూద్దురు కానీ అని జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.