ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో జాలి, సానుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. వైసీపీ, బీజేపీ కలిసి టీడీపీని తొక్కేయాలనుకుంటున్నాయని.. తెలంగాణలో మాదిరిగానే… టీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. అలాంటి పరిస్థితిని తేబోతున్నాయని ఆయన అంటున్నారు. ఈ మేరకు ఉదాహరణలు చాలా చెప్పుకొచ్చారు. అంతిమంగా ఆయన ఆర్టికల్ ఉద్దేశం… జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో బీజేపీ ఎదగడానికి తన వంతు సాయం చేయబోతున్నారనే. ఆయన తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు..అన్ని ప్రయత్నాలు చేస్తూ.. ఇంకా పెంచుకునేందుకు మత మార్పిళ్లు చేస్తూ.. బీజేపీ ఎదిగినా… తనకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ సమయంలో ఈ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
తిరుపతి ఉపఎన్నిక విషయంలో వైసీపీకే అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉంటుందని ఆర్కే తేల్చారు. అయితే.. మెజార్టీ తగ్గించినా… బొటాబొటితో వైసీపీ గెల్చినా.. అది గెలుపు కాదని.. తీవ్రమైన అసంతృప్తికి నిదర్శనంగా మిగిలిపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రెండో స్థానానికి రావాలని చేస్తున్న ప్రయత్నాలను ఆర్కే విశదీకరించారు. ఏ పార్టీఅయినా.. గెలుపు కోసమో.. రెండో స్థానంలో ఉండటం కోసమో పనిచేస్తుంది. కావాలని ఓడిపోవడానికి ఎవరూ పోటీ చేయరు. అయితే ఆర్కే మాత్రం… వైసీపీ, బీజేపీ… టీడీపీని లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తాయని…చెబుతున్నారు.
రాజకీయాల్లో ఎవరిపై ఎవరికీ సానుభూతి ఉండదు. పక్క పార్టీని..లేదా పక్క నేతను తొక్కేసి తాము ఎదిగిపోవాలని అనుకునేవాళ్లే వంద శాతం ఉంటారు. వారి నుంచి తమ పార్టీని లేదా.. తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకునేవాళ్లే రాజకీయాల్లో నిలబడతారు. సుదీర్ఘ కాలంగా జర్నలిజంలో ఉన్న వేమూరి రాధాకృష్ణకు అది తెలియనిదేం కాదు. ఇప్పుడన్నీ… రాజకీయ వ్యూహాలు భావోద్వేగాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ మార్పును తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకుని పైకి రాలేకపోతే.. అది బీజేపీ, వైసీపీ తప్పెలా అవుతుంది. కానీ…ఆ తప్పును ప్రత్యర్థి పార్టీలపైకి నెట్టేస్తున్నారు రాధాకృష్ణ.
అదే సమయంలో… టీడీపీపై ప్రజల్లో ఓ రకమైన సానుభూతి..జాలి కల్పించి…బీజేపీ,వైసీపీ ఒక్కటేనన్న భావనను కూడా ప్రజల్లో కల్పించేందుకు ఆర్కే తన కొత్తపలుకు ద్వారా ప్రయత్నించినట్లుగా స్పష్టమవుతోంది.జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ అని అన్నాడని ప్రజలు ఓట్లేశారని… ఇప్పుడు ఆయన పాలన దారుణంగా ఉందన్న అభిప్రాయం కల్పించడానికి ఆర్కే ప్రయత్నించారు. మొత్తంగా… ఆర్కే పొలిటికల్ ఆర్టికల్స్ ఎప్పుడు రాసినా.. ఓ లాజిక్ ఉండేది. కానీ.. ఈ సారి అది మిస్ అయింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల వ్యూహం ఎక్కడ ఏపీలో అమలు చేస్తారోనని…దానికి కేసీఆర్ సహకరించినట్లుగా జగన్ ఎక్కడ సహకరిస్తారోనని ఆయన తన ఆర్టికల్కో కంగారు పడటమే ఎక్కువగా కనిపించింది.