న్యాయస్థానాలపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసే సంస్కృతిని వైసీపీలో అధినేత నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకూ నరనరాన జీర్ణించుకున్నారు. ఎమ్మెల్యేగా సరిగ్గా ప్రమాణం చేయలేక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు.. ఈ సారి తన భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఏడో తరగతి వరకే చదువుకున్న ఈ ఎమ్మెల్యేకు తెలుగు కూడా సరిగ్గా రాదు. కానీ.. తమ పార్టీ న్యాయమూర్తుల్ని విమర్శిస్తోంది కాబట్టి… తాను తన నోటి పవర్ని చూపించాలనుకున్నారు . చెలరేగిపోయారు.
అసలు మీరు జడ్జి లేనా..? అంటూ ప్రారంభించి.. జడ్జిలకు ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. జడ్జీలుగా మీరు అవినీతికి పాల్పడ వచ్చా.. పేద కుటుంబంలో మీరు పుట్టలేదా..పేదల కష్టాలు నీకు తెలియవా అని ఆవేశపడ్డారు. కోర్టులలో చంద్రబాబు ఏమి చెబితే అది కీలకంగా మారుతున్నాయని.. ఇలాంటప్పుడు జడ్జి పదవికి మీరు మోసం చేసినట్టు కాదా అని ఆయన ఆవేదనా స్వరంతో చెప్పుకొచ్చారు. పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి ఎంత చెబితే అంత. తన నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కోర్టు ఉత్తర్వులపై ఆయన ఇలా స్పందించినట్లుగా చెబుతున్నారు.
తాము ఏం చేస్తే అదే న్యాయం…తాము ఏం చెబితే అదే చట్టం అన్నట్లుగా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. న్యాయస్థానాలకు బాధితులు వెళ్లి.. న్యాయం పొందితే.. అది తమకు జరిగిన అన్యాయంగా భావిస్తున్నారు. తమకు అనుకూలంగా తీర్పులు రాకపోతే… న్యాయవ్యవస్థపైన నిందలు వేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. దానికి తాజా సాక్ష్యం…పూతలపట్టు ఎమ్మెల్యే వ్యాఖ్యలే.