జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి, నివార్ తుఫాను ద్వారా నష్టపోయిన రైతులకు 35వేల పరిహారం వెంటనే ఇప్పించాలని అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అభిమానులు ప్రజలు అడుగడుగునా పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై కూడా విమర్శల వర్షం కురిపించారు. గుడివాడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, మంత్రి కొడాలి నానికి పేకాట క్లబ్ ల మీద ఉన్న శ్రద్ధ రోడ్లు బాగు చేయించడంపై లేదని విమర్శించారు. అదే విధంగా జనసైనికులపై ఒక వర్గం మీడియా చేస్తున్న దాడిని తాము బలంగా ఎదుర్కొంటామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తుఫాను ద్వారా నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయల పరిహారం వెంటనే అందించాలని, అలా అందించలేకపోతే అసెంబ్లీ సమావేశాలు విజయవాడలో పెట్టుకున్నా విశాఖపట్నంలో పెట్టుకున్నా కడప జిల్లాలో పెట్టుకున్నా కూడా తాము అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
గతంలో భవన నిర్మాణ కార్మికుల సమస్య విషయంలోనూ, సుగాలి ప్రీతి సమస్య విషయంలో, ఇతర సమస్యల విషయంలోను పవన్ కళ్యాణ్ హెచ్చరించిన వెంటనే ఆగమేఘాల మీద స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి రైతుల విషయంలో పవన్ చేసిన హెచ్చరికకు ఎలా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.