కృష్ణాజిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కు ఊహించని విధంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. పేర్ని నాని, కొడాలి నాని లు గతంలో పవన్ కళ్యాణ్ ని, సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్న పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విమర్శించిన వ్యాఖ్య లని పవన్ కళ్యాణ్ ఈ పర్యటన సందర్భంగా ఒక రేంజ్ లో తిప్పి కొట్టిన తీరు ఆయన అభిమానులలోనే కాకుండా స్థానిక ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన రాబట్టుకుంది. అయితే ఊహించిన విధంగానే సాయంత్రానికల్లా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నేతలతో వైఎస్ఆర్సిపి ప్రతి దాడి ప్రారంభించింది.
వైఎస్ఆర్సిపి నేత మంత్రి కురసాల కన్నబాబు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. రైతులకు మేలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ తో గానీ మరొకరితో కానీ చెప్పించుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి లేదని, గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా రైతులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చిన రెండు మూడు సంవత్సరాల వరకు పరిహారం ఇవ్వలేదని చెబుతూ పరిహారం అందించడంలో తమ పార్టీ జాప్యాన్ని సమర్థించుకున్నారు. ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి బిజీగా ఉందని, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పండుగ వలే జరుగుతోందని, ఈ కార్యక్రమం కారణంగా జగన్ కు మంచి పేరు వస్తూ ఉండడం వల్ల ఎలాగోలా దీన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ రైతుల పేరిట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్ సీపీ నేత కురసాల కన్నబాబు. ఇదంతా ఒక కథ స్క్రీన్ ప యాక్షన్ ప్రకారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు .
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం చేస్తారా లేక ప్రకటనతో సరి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయకుండానే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.