2013… విశ్వరూపం సినిమా. ‘డీటీహెచ్’ ( డైరెక్ట్ టూ హోం) రిలీజ్ పై కమల్ హాసన్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ”నా సినిమాని నేరుగా హోమ్ థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటాను. ఇది థియేటర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటున్నానంతే. భవిష్యత్ సినిమాకి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కీలకం కాబోతున్నాయి. ఇప్పటి నుండే ఇండియన్ సినిమా ఆ దిశగా అడుగులు వేయాలి” అని చాలా వివరంగా ఓ స్పీచ్ ఇచ్చారు. కమల్ హాసన్ అవస్థ ఏమిటో చాలా మందికి అర్ధం కాలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు అనివార్యం అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా నేల టికెట్టు ప్రేక్షకుడికి కూడా డిజిటల్ రిలీజ్ అంటే ఏంటో అర్ధమైపోయింది. థియేటర్లు మూత పడిపోవడంతో ఓటీటీనే దిక్కైయింది. అప్పులు చేసి సినిమాలు తీసిన నిర్మాతలకు ఓటీటీ రిలీజ్ కొంత ఉపసమనం కలిగిచింది. లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై ప్రత్యేక్షమైయ్యాయి. అందులో కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…
కృష్ణ అండ్ హిజ్ లీల :
తెలుగు ప్రేక్షకులని ఓటీటీ లో పలకరించిన మొదటి మీడియం సినిమా కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ అయినా ‘బావుంది” అనే టాక్ తెచ్చుకున్న సినిమా మాత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఎలాంటి అంచనాలు , ముందస్తు ప్రచారం లేకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన సినిమా ఆల్ట్రా మోడ్రన్ రొమాంటిక్ కామెడీ అనిపించుకుంది. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ చూస్తున్నంత సేపు ఎలాంటి విసుగు తెప్పించకుండా చాలా లైటర్ వెయిన్ లో సాగిపోయింది. సినిమా పాయింట్ కొత్తదేమీ కాదు. ఇద్దరమ్మాయిలను ప్రేమించడం, ఇద్దరిలో ఎవరు కావాలనేది తేల్చుకోలేకపోవడం… శోభన్‌బాబు కాలం నాటి పాయింట్. అయితే ఈ పాయింట్ ని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు ప్రజంట్ చేయగలిగాడు దర్శకుడు రవికాంత్. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్, షాలిని, సీరత్ కపూర్ ఇలా పాత్రలన్నీ నేచురల్ గా కనిపించాయి. అన్నట్టు.. సిద్ధు ఈ సినిమాకి రచనా సహకాం కూడా అందించాడు.
‘భానుమతి అండ్ రామకృష్ణ’:
ఆహా వేదికగా వచ్చినీ సినిమా మెచ్యూర్డ్ లవ్ స్టొరీ అని ప్రశంసలు అందుకుంది. పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, సంఘటనలు చాలా సహజంగా సాగాయి. ముఫ్ఫై ఏళ్ళు నిండిన భిన్న ధృవాలైన అమ్మాయి, అబ్బాయి. ఇదే ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్. చెప్పుకోవడానికి ఓ పెద్ద కధ అంటూ లేకపోయినా .. పాత్రల మధ్య వున్న సంఘర్షణని చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి. నవీన్ చంద్ర, సలోని లూత్రాల నటనకి మంచి మార్కులు పడ్డాయి. టెక్నికల్ గా ఏమంత గొప్పగా అనిపించని ఈ సినిమా.. రైటింగ్ పరంగా మాత్రం ఫుల్ మార్కులు వేసుకుంది. ‘స్క్రిప్ట్ బావుంటే చాలు” అనే మాట వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో. ‘భానుమతి, రామకృష్ణ’కి స్క్రిప్టే బలంగా నిలిచింది. ఆహాలో వున్న కంటెంట్ లో చూడబుల్ సినిమా ఇది.
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య:
లాక్ డౌన్ లో ఓటీటీ స్టార్ గా నిలిచాడు సత్యదేవ్. అతడి నుండి చాలా కంటెంట్ వచ్చింది. అందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా వుంది. నెట్‌ఫ్లిక్స్ విడుదలైన ఈ సినిమా ఫీల్ గుడ్, కామన్ మెన్ రివెంజ్ స్టొరీ అనిపించుకుంది. మలయాళ సినిమా ‘మహేషింటె ప్రతిగారమ్’కి రిమేక్ గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ ఫ్లావర్ ని క్యారీ చేసింది. తొలి సినిమా కంచరపాలెంతో ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఉమామహేశ్వర ని కూడా చాలా సహజంగా తీర్చి దిద్దాడు. నటుడిగా మరో పది మార్కులు వేసుకున్నాడు సత్యదేవ్. అరకు నేపధ్యం తీసుకోవడంతో ఫ్రెష్ ఫీలింగ్. పాటలు, నేపధ్య సంగీతం కూడా బావున్నాయి. పేరుకే ఉగ్ర రూపం కానీ ఆహ్లాదంగ సాగే సినిమా ఇది.
కలర్ ఫోటో:
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ”చాలా బావుంది” అనిపించుకున్న సినిమా కలర్ ఫోటో. ఆహా వేదికగా వచ్చినీ సినిమా యువతతో పాటు సీరియస్ ఫిల్మ్ లవర్స్ ని కూడా ఆకట్టుకుంది. ప్రేమకు కులం, మతం, పేదధనిక అంతరం ఎప్పుడూ అవరోధాలే. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు ఈ పాయింట్ల పై వచ్చాయి. అయితే కలర్ ఫోటో లో మాత్రం ‘వర్ణం’ని కాయిన్ చేశారు. రంగు ని కాయిన్ చేస్తూ కులం, మతం, పేదధనిక ఈ పాయింట్లన్నీ టచ్ చేస్తూ ఓ ప్రేమ కధని రాసుకున్నారు. చూపించడంలో విజయం కూడా సాధించారు. సుహాస్ నటన బావుంది. జయకృష్ణ పాత్రలో ఇమిడిపోయాడు. చాందిని పాత్ర కూడా చక్కగా తీర్చిదిద్దారు. సునీల్ కొత్తగా కనిపించాడు. వైవా హర్ష పాత్ర సినిమా చూసిన జనాలు అంత ఈజీగా మర్చిపోలేరు. రచన పరంగా ఈ సినిమాకి ఫస్ట్ క్లాస్ మార్కులు పడతాయి. ఎమోషనల్ కధలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఇంకా నచ్చుతుంది.
ఆకాశం నీ హద్దురా :
ఇప్పటివరకూ సౌత్ లో ఓటీటీ వేదికగా విడుదలైన పెద్ద సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. థియేటర్ల కోసం ఎదురుచూసిన సూర్య ఇంక నిరీక్షణ మానుకొని అమెజాన్ ప్రైమ్ లో సినిమాని విడుదల చేశారు. సూర్య చేసిన తొలి బయోపిక్ ఇది. కామన్ మెన్ కల తీర్చిన ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. సూర్య ఆ పాత్రలో జీవించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ టచ్ చేస్తూనే చాలా జెన్యూన్ గా తీసిన సినిమా ఇది. టెక్నికల్ గా ఎక్కడా రాజీ పడలేదు. హీరో పాత్రకు సమాంతరంగా తీర్చిదిద్దిన హీరోయిన్ పాత్ర ఓ కొత్త అనుభూతి ని కలిగిస్తుంది. రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా అపర్ణ బాలమురళి పాత్ర నడిచిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ‘గురు’ తర్వాత దర్శకురాలిగా సుధ కొంగర ప్రతిభ మరోసారి చాటుకుంది.
మిడిల్ క్లాస్ మెలొడీస్ :
ఆనంద్ దేవరకొండ తొలిసారి హిట్ అనే పదం వినగాలిగాడు. తొలి ప్రయత్నంలోనే ‘దొరసాని’ లాంటి చాలా భారమైన కధతో వచ్చిన ఆనంద్ .. రెండో ప్రయత్నంగా మొత్తం రూటు మార్చేసి మిడిల్ క్లాస్ మెలొడీస్ చేశాడు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంది. మధ్య తరగతి కధ కావడంతో మ్యాగ్జిమమ్ కనెక్ట్ అయ్యారు. గుంటూరు పల్లె జీవితాలను, అక్కడి జీవన సరళిని చక్కగా చూపించారు. మధ్య తరగతి కష్టాలు కాకుండా ఆ కుటుంబాల్లో వుండే లైటర్ వెయిన్ వినోదంని పట్టుకున్నారు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ చక్కగా కనిపించారు. గోపరాజు రమణ పాత్ర గుర్తిండిపోతుంది. దర్శకుడు వినోద్ అనంతోజు తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు.
ఓటీటీ వల్ల లాభమేనా?
లాక్ డౌన్ లో ఓటీటీ వేదికలు లేకపోయింటే సినిమా పరిశ్రమ మరీ దారుణంగా వుండేది. అప్పులు చేసిన నిర్మించిన సినిమాలు వడ్డీలు నడ్డి విరిచే పరిస్థితి. అయితే ఓటీటీ సినిమాని అమ్ముకొని కొంత వరకూ బయటపడ్డారు సినీ రూపకర్తలు. భవిష్యత్ లో కూడా ఓటీటీ ఓ ప్రధాన వేదిక కాబోతుంది. ముఖ్యంగా చిన్న మీడియం సినిమాలకు ఓటీటీ కొత్త ఊపు తెచ్చింది. క్రియేటివ్ ఫ్రీ డమ్ పెరిగింది. కొన్ని భిన్నమైన ఆలోచలు, విలక్షణమైన కధలు చేసినప్పుడు థియేటర్ విడుదల సాధ్యమేనా ? ప్రశ్న వుండేది. అయితే ఓటీటీల రాకతో ఆ ప్రశ్న పోయింది. కంటెంట్ బావుంటే చాలు.. ఒటీటీలు తీసుకుంటున్నాయి. డ్యురేషన్ లెక్కలు వేసుకోవడం లేదు. మూడు నాలుగు చిన్న కధలు కలిపి అందిస్తున్న మినీ మూవీలు కూడా వర్క్ అవుట్ అవుతున్నాయి.
అయితే పెద్ద సినిమా విషయానికి వస్తే ఓటీటీ లాభదాయకం కాదు. కోట్లు పెట్టి తీసే సినిమాలకు మళ్ళీ అన్ని కోట్లు ఇచ్చే పరిస్థితి ఓటీటీల్లో లేదు. పైగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసిన సినిమాని బుల్లితెరకు, స్మార్ట్ ఫోన్ కి పరిమితం చేసేయం అటు ఫిల్మ్ మేకర్ కి కూడా ఇష్టం లేని విధానం. కొన్ని సినిమాలు కేవలం థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తీయబడతాయి. అలాంటి సినిమాలు ఓటీటీలో వర్క్ అవుట్ కావు. థియేటర్ ఇచ్చే అనుభూతి ఓటీటీ పంచలేదు. పైగా కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా వున్నాయి. కొన్ని సినిమాలు, వెబ్ సిరిస్ లు ఆడియో మిక్సింగ్ చేసినపుడు థియేటర్ క్యాలిటీకి చేస్తున్నారు. అవి ఒటీటీలో వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ (హెడ్ సెట్ తో), మంచి హోం థియేటర్ వున్న టీవీలు ఆ క్యాలిటీ ని ఇవ్వగలుగుతున్నాయి కానీ .. కొన్ని టీవిల్లో ఆడియో ఇబ్బంది కరంగా వుంటుంది. ముఖ్యంగా సోనీ టీవీ వినియోగదారులకు ఈ సమస్య వుంది. ఆడియో ని కొన్ని లెవల్స్ లో సెట్ చేసుకోవాలి. లేదంటే డైలాగ్, ఆర్ఆర్ మిక్స్ అయిపోయి వినిపిస్తుంది. ఆర్ఆర్ గట్టిగా వినిపించడం, సౌండ్ తగ్గిస్తే డైలాగ్ వినిపించకపోవడం.. ఈ సమస్య వుంది. టెక్నికల్ గా తెలిసిన వాళ్ళు .. దాన్ని సెట్ చేసుకుంటున్నారు. తెలియని వాళ్ళు .. టీవీ జోలికి వెళ్ళకుండా స్మార్ట్ ఫోన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. నెట్ స్పీడ్ పై కూడా సినిమా ఎక్స్ పిరియన్స్ ఆధారపడుతుంది. సీరియస్ గా సీన్ జరిగుతున్నప్పుడు వీడియో బఫర్ అయితే ఫీల్ మిస్ అయిపోతుంది. వైఫై స్పీడ్ వుంటే ఓకే కానీ ముబైల్ డాటాతో చూసే వాళ్ళకు మాత్రం ఈ సమస్య వుంటుంది.
ఏదేమైనా ఒటీటీ విప్లవం భవిష్యత్ లో మరింత కీలకం కానుంది. ముఖ్యంగా చిన్న, మీడియం సినిమాలు, విలక్షణమైన కాన్సెప్ట్స్ వచ్చే కంటెంట్ కు .. ఇదే ప్రధాన వేదిక అయ్యే ఛాన్స్ కూడా వుంది. కావాల్సిందంత మంచి కంటెంట్ క్రియేట్ చేయడమే. అందరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దం.