తలైవా రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. తన ఆరోగ్యం సహకరించడం లేదని… తనను నమ్ముకున్న వారిని బలి పశువును చేయలేనని.. ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తమిళంలో ఉన్న మూడు పేజీల లేఖను విడుదల చేశారు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ చేస్తానని ప్రకటించారు. మామూలుగా అయితే ఈ నెల 31వ తేదీన ఆయన రాజకీయ ప్రకటన చేయాల్సి ఉంది. పార్టీ పేరు, గుర్తు అన్నీ రెడీ అయిపోయాయి. అయితే.. అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేసి.. పూర్తి స్థాయిలో రాజకీయ రంగంలోకి దిగాలనుకున్న రజనీకి…ఏదీ కలసి రాలేదు. మొదట సినిమా యూనిట్లో చాలా మందికి కరోనా రావడంతో షూటింగ్ ఆగిపోయింది. తనకు నెగెటివ్ వచ్చినా… బీపీ పెరగడంతో ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. వైద్యులు పరి పరివిధాల సలహాలు ఇచ్చిన తర్వాత రాజకీయంగా టెన్షన్లు పెట్టుకోకపోవడం మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన కుమార్తెలు కూడా ఆందోళన చెందారు. మనకు రాజకీయాలు వద్దని.. తండ్రికి నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లి.. అందరితో నానా మాటలు పడటంతో పాటు… లేని పోని ఆరోపణలు చేస్తూంటారని.. మానసికంగా కూడా ఇబ్బంది పెడతారని… ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో.. రాజకీయం చేయడం అనవసరమని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. కుమార్తెల అభిప్రాయాలతో రజనీకాంత్ ఏకీభవించినట్లుగా తాజాగా చేసిన ప్రకటనతో తేలిపోయింది.
రజనీకాంత్ పార్టీ పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే గతంలో.. ఓ వైపు కరుణానిధి.. .మరో వైపు జయలలిత బలంగా ఉండటంతో పొలిటికల్ గ్యాప్ లేకుండా పోయింది. కానీ… వారిద్దరూ లేని రాజకీయంలో బలమైన నేత కోసం.. తమిళనాడు ఎదురు చూస్తోంది. ఆ గ్యాప్‌ను రజనీకాంత్ ఫిల్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన కూడా… వెటరన్ అయిపోయారు. ఆరోగ్యం సహకరించడం మానేసింది. చివరికి.. అన్ని ప్రయత్నాలు చేసుకుని.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి.. రజనీ పార్టీ పెడతారా లేదా.. అన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరిగింది. చివరికి పార్టీ పెడతానన్న తర్వాత ఇక… దూకుడేనని అనుకున్నారు… చివరికి ఆరోగ్య కారణాలతో రాజకీయం జోలికి వెళ్లకూడనది డిసైడయ్యారు.