మూడు రోజుల్లోగా ఎన్నికల సంఘం. ప్రభుత్వం చర్చలు ప్రారంభించి.. స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు పంచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి ఇప్పుడు స్ట్రెయిన్ ఆయుధం దొరికింది. నిన్నటిదాకా… సెకండ్ వేవ్ అని.. మరొకటని.. వ్యాక్సిన్ అని.. కారణాలు చెప్పి.. ఎన్నికలు వాయిదా వేయించండానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. కానీ కోర్టు అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణలో పూర్తి అధికారం ఎస్ఈసీదే కాబట్టి… ఆయనతోనే చర్చలు జరపాలని సూచించి.. పంపేసింది. అ ప్రకారం ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తన పదవీకాలంలో ఒక్క సారి అయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ ఇప్పటి వరకూ.. తన రాజ్యాంగ అధికారాలను వీలైనంతగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయనకు అన్నీ కలసి వస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా కరోనా స్ట్రెయిన్ వైరస్ ఏపీలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. జాగ్రత్తగా ఉండాలని…ఆదేశించింది. కొన్నిరకాల ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించకుండా.. కొత్త ఆయుధం దొరికినట్లయింది. నిమ్మగడ్డతో జరిపే చర్చల్లో ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.
నిమ్మగడ్డ.. స్ట్రెయిన్ వైరస్ ప్రభావాన్ని ఎంతగా అంచనా వేసుకుంటారన్నది కీలకం. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరేమనుకున్నా.. తనకున్న అధికారంతో..తాను చేయాలనుకున్నది చేయాలనుకుంటే మాత్రం ఎన్నికల నిర్వహణ తప్పకపోవచ్చు. ఆయనను వైసీపీ సర్కార్ అనేక విధాలుగా వేధించింది. చివరికి కుమార్తె పైనా ఆరోపణలు చేశారు. పదవి నుంచి తొలగించి.. అనేక రకాల నిందలు కూడా వేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. తాను చేయాల్సింది తాను చేస్తానని అనుకుంటే మాత్రం.. ప్రభుత్వానికి.. ఎస్ఈసీకి మధ్య మరోసారి ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతుంది.
స్ట్రెయిన్ కారణంగా ప్రజల్లో మరింత భ యాందోళనలు పెంచడం ఎందుకని… ప్రభుత్వం సహకరించడం లేదనే ముద్ర వేస్తే చాలనుకుంటే.. నిమ్మగడ్డ ప్రత్యేకమైన వ్యూహాన్ని అముల చేసే అవకాశం ఉంది. మార్చి వరకూ ఆయనకు పదవీ కాలం ఉంది. ఈ లోపు..ఎన్నికలు జరుగుతాయా లేదా.. అన్నది పూర్తిగా నిమ్మగడ్డ చేతుల్లోనే ఉంది. కానీ ఆయన మరీ మంకుపట్టుకు పోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడకుండా చూసుకోవాల్సి ఉంది.