రజనీ తన రాజకీయ చిత్రానికి `క్లాప్` కొట్టకుండానే పేకప్ చెప్పేశాడు. అనారోగ్య కారణాల వల్ల పార్టీ ప్రకటన చేయలేకపోతున్నా – క్షమించండి అంటూ అభిమానుల్ని వేడుకున్నాడు. రజనీరాజకీయాల్లోకి వస్తున్నా – వస్తున్నా అంటూ ఊరించి ఊరించి `ఇక పార్టీ పెట్టడులే` అని రిలాక్సయిపోతున్న అభిమానులకు, `పార్టీ పెట్టేస్తున్నా` అనే ప్రకటన ఎంత ఉత్సాహాన్నీ, షాక్ ని కలిగించిందో.. అంతకంటే రెట్టింపు విస్మయానికి గురి చేసింది.. రెండో ప్రకటన.
రజనీ వస్తే – తమిళ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది అని నమ్మిక ఆశావాహులు ఇప్పుడు నిరాశలో కూరుకుపోయారు. రజనీ నిష్క్రమణకి తన అనారోగ్య కారణాల్ని చూపిస్తున్నా – లోలోపల చాలా తతంగమే నడిచి ఉంటుందని అక్కడ మీడియా వర్గాల వాదన. పార్టీ పెడితే పరిస్థితి ఏమిటి? అనే విషయాన్ని రజనీ లోపాయకారిగా… పరిశోధించారని, ఓ టీమ్… తమిళ రాష్ట్రమంతా తిరిగి.. రిపోర్టు సేకరించిందని, ఆ రిపోర్టు రజనీకి అనుకూలంగా లేదని, దాన్ని చూసి రజనీ భయపడ్డారని ఓ టాక్ వినిపిస్తోంది. ఎవరైనా సరే, రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నప్పుడు ఇలాంటి కసరత్తు చేయడం తప్పని సరి. రజనీ లాంటి స్టార్ చేయకుండా ఎలా ఉంటారు? రజనీ గురి ఎప్పుడూ.. ఒక్కటే. పార్టీ పెట్టడం – అధికారాన్ని కైవసం చేసుకోవడం చిటికెలో జరిగిపోవాలి… అని ప్లాన్ వేశారు.కానీ పార్టీ పెట్టిన వెంటనే ప్రజలు బ్రహ్మరథం పట్టరని, దానికి కొంత సమయం కావాలన్న విషయాన్ని రజనీ చేయించిన సర్వేలు బట్టబయలు చేశాయని, అందుకే రజనీ డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. రాజకీయాల్ని మార్చేసి, విప్లవాత్మకమైన మార్పులు చేసేంత సీన్ తనకు లేదన్నది అర్థమై.. ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నారనిస్తోంది.
నిజంగానే రజనీ ఆరోగ్యం అంతంత మాత్రమే. ఆయన వయసు 70 దాటింది. రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి, వారసులకు అధికారం అప్పగించాలన్న కాంక్షతో ఉండే వయసు ఇది. ఇలాంటి వయసులో కొత్తగా ఓ పార్టీ పెట్డడం, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు.పైగా కరోనా భయాల మధ్య. ఇటీవల రజనీ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం విషయంపై కుటుంబ సభ్యులకు చాలా భయాందోళనలు ఉన్నాయి. ఇవన్నీ వెనకడుగు వేసేలా చేశాయి.
* మరో మార్గం లేదా?
రజనీ ఇప్పటికీ… `రాజకీయాల్లోకి రాను` అనడం లేదు. మరింత ఆలస్యం అవుతుంది అంటున్నారంతే. అంటే.. ఎక్కడో ఓ చోట హోప్ ఉందన్నమాట. రజనీ రాజకీయాల్లోకి వస్తే… పార్టీ పెట్టే అవకాశాలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకుల మాట. ఆయన ఏదో ఓ పార్టీ పంచన చేరి, మద్దతు తెలపొచ్చని అంటున్నారు. అలాగని ఆయన ప్రత్యక్షంగానూ రాజకీయాలు చేయరట. కేవలం ఓ పార్టీ వెనుక మాత్రమే ఉంటారని తెలుస్తోంది. బీజేపీ వైపే రజనీ మొగ్గు చూపించే ఛాన్సుందన్నది తమిళ మీడియా మాట. ఈ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి, వచ్చే పార్లమెంటు ఎన్నికలలోగా… రజనీ బీజేపీ జెండా పట్టుకోవచ్చని అంటున్నారు.