మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద భూముల అమ్మకంపై దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ వైదొలగాలని దాఖలైన రిక్విజన్ పిటిషన్ విషయంలో.. హైకోర్టు న్యాయమూర్తిపైనే తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కారణంగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసు దాఖలుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్‌కుమార్ మిషన్ బిల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని వ్యాఖ్యానించారని.. అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తి .. తమకు న్యాయం చేయరన్న ఉద్దేశంతో విచారణ నుంచి వైదొలగాలని రిక్విజల్ పిటిషన్ వేశారు.
తాను ఈ వ్యాఖ్యలను… విచారణలో లాగిన్ అయి విన్నానని పిటిషన్లో ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే అలా లాగిన్ అవడం.. సైబర్ నేరం అవుతుందన్న వాదనలు వినిపించారు. అయితే కోర్టు ఆ వివాదం వైపు వెళ్లలేదు. కానీ.. తాను అన్నట్లుగా చెబుతున్న వ్యాఖ్యలను.. తాను ఎప్పుడు అన్నానో చూపించాలని జస్టిస్ రాకేష్ కుమార్ .. ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. ఓ సారి.. ప్రవీణ్ కుమార్ లాగిన్ అయి విన్నారని.. మరోసారి పత్రికల్లో వచ్చిందని .. మీడియా చానల్స్‌లో వచ్చిందని వాదించారు. అలా వచ్చి ఉంటే.. ఆ పేపర్ క్లిప్పింగ్‌లు కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే అలా ఏ మీడియాలోనూ రాలేదు. దాంతో… ఎక్కడ అలాంటి మాటలు అన్నారో చూపించలేకపోయారు.
దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ డైరెక్టర్… ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కారం అభియోగాల కింద .. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్ ను ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని.. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.