తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగుల్లో తనపై నమ్మకం పెంచుకునేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం.. ప్రకటనలతోనే సరిపెట్టడం లేదు. ఉద్యోగ సంఘ నేతలతో కూడా వరుస సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాలను దాదాపుగా నిర్వీర్యం చేసినంత పనిచేసిన కేసీఆర్… ఆయా సంఘాల నేతలు నోరెత్తకుండా చేయగలిగారు. దాంతో.. తెలంగాణ ఉద్యమంలో… అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాలు తర్వాత ఉనికి కోల్పోయాయి. ఆ కారణమో… ఉద్యోగులకు చేయాల్సిన మేళ్లు చేయలేదన్న ఆగ్రహమో.. కానీ ఉద్యోగవర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దీన్ని తగ్గించేందుకు కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగ సంఘాలను గుర్తించడం ప్రారంభించారు. గురువారం టీఎన్జీవో నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా పై స్థాయి నేతలతో కాదు.. టీఎన్జీవోలోని అన్ని స్థాయిల నేతలను సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 350 మంది టీఎన్జీవో నేతలను పిలిచారు. వీరందరితో కేసీఆర్ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తారు. వారు లెవనెత్తిన సమస్యలపై అప్పటికప్పుడు అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేస్తారు.
గ్రేటర్ ఎన్నికల తర్వాత ఒక్క సారిగా వ్యూహాన్ని మార్చుకున్న కేసీఆర్.. ప్రభుత్వంపై ఏ ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయో గుర్తించి.. వారిని మంచి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఇంత కాలం గుర్తుకు రాని ఉద్యోగ సంఘాలు.. ఇప్పుడు రాజకీయంగా కష్టం వస్తే.. గుర్తుకు వచ్చాయా.. అన్న విమర్శలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ తన ప్రయత్నాలు తాను చేయబోతున్నారు.