ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల కంపెనీలు ఒక్కొక్కటిగా దివాలా తీస్తున్నాయి. భారీ కాంట్రాక్టుల పేరుతో రుణాలు తీసుకున్న ఆ సంస్థలు.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయాయి. కానీ ఆ పేరుతో తీసుకున్న రుణాలను మాత్రం దారి మళ్లించి… సొంత ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పటికీ… మాజీ ఎంపీ రాయపాటి సాంబశిరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై రూ. ఏడు వేల కోట్ల వరకూ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులు నమోదయ్యాయి. సీబీఐ దాడులు చేసింది. తాజాగా.. ఐవీఆర్సీఎల్ అనే సంస్థపైనా సీబీఐ దాడులు చేసింది. ఈ సంస్థ ఖాతాలో రూ. ఐదు వేల కోట్ల స్కాం చేరింది. ప్రాజెక్టుల పేరుతో రుణాలు తీసుకుని వాటిని కట్టకపోగా.. రుణాలను దారి మళ్లించినట్లుగా ఈ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి.
కడపకు చెందిన సుధీర్ రెడ్డి, బలరాంరెడ్డి అనే వ్యక్తులు ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈ కంపెనీ.. ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టడంలో చాలా దూకుడుగా వ్యవహరించింది. అయితే ఆ తర్వాత గ్రహణం పట్టింది. ఓ దశలో.. దేశంలో అత్యంత సమర్థవంతమైన రియల్ ఎస్టేట్ కంపెనీగా భావించారు. కానీ యాజమాన్యం తాము తీసుకున్న రుణాలను ఇతర వాటికి మళ్లించడం ప్రారంభించడంతో … ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. చివరికి తీసుకున్న కాంట్రాక్ట్ పనులను కూడా పూర్తి చేయలేకపోయారు. రెండేళ్ల కిందటే.. ఈ సంస్థ చేతులెత్తేసింది. కంపెనీని అమ్ముదామని చాలా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
ఐవీఆర్సీఎల్ సంస్థ రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంతో.. ప్రభుత్వం ఎప్పుడో రైటాఫ్ చేసింది. అంటే.. బ్యాంకుల ఖాతాల నుంచి రద్దు చేసింది. నిరర్థక ఆస్తులు ప్రకటించింది. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. సీబీఐ ఇప్పుడు కేసు బుక్ చేసి.. సోదాలు చేస్తోంది. ఐవీఆర్సీఎల్ సంస్థ యాజమాన్యం … ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకులు. పొంగులేటికి కూడా బడా కాంట్రాక్ట్ కంపెనీ ఉంది. సీబీఐ కేసులు నమోదు చేయాలనుకుంటే.. రుణాలు దారి మళ్లించినప్పుడే చేయాల్సి ఉంది. కానీ రైటాఫ్ చేసిన రెండేళ్ల తర్వాత… కేసులు నమోదు చేస్తే.. జప్తు చేయడానికి ఏం ఆస్తులు మిగులుతాయన్న ప్రశ్న నిపుణుల నుంచి వస్తోంది. అయితే.. సీబీఐ కేసులు… సోదాలు అన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి. దానికో లాజిక్ ఉంటుంది. కానీ అది.. తెలియాల్సిన వాళ్లకే తెలుస్తుంది.