హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రతీ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభంలో చెప్పుకుంటారు. అదేమి దురదృష్ఠమో కానీ.. 2020 ఏపీ ప్రజలు అలాంటి హ్యాపీ విషెష్‌తో అడుగు పెట్టలేదు. రాజధాని మార్పు గందరగోళంతో ఏపీ తన 2020 జర్నీని ప్రారంభించింది. రైతుల ఆందోళనలు.. వారిపై ప్రభుత్వ దమన కాండ.. మహిళల రోదనలు.. అన్నీ ఏడాది మొత్తం ఉన్నాయి.
మూడు రాజధానుల బిల్లుల రచ్చతో ప్రారంభం… అదే గొడవ కంటిన్యూ…!
2020 ప్రారంభంలో … శాసనససభలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించుకున్న ప్రభుత్వం శాసనమండలిలో బిల్లు పెట్టింది. బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లింది. ఈ సందర్భంలో మండలిలో జరిగిన వ్యవహరాలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేవే. రాష్ట్ర విభజన సమయంలో ఎలా అయితే.. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి.. బిల్లును పాస్ చేసుకున్నారో… అమరావతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వం అదే టెక్నిక్ పాటించింది. కానీ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహం దెబ్బతిన్నది. నాలుగు రోజుల గ్యాప్ తీసుకుని ఆయన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రానికి పంపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు లభించలేదు. అదే సమయంలో హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమయింది. ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన తండ్రిని అంటే వైఎస్‌ను చంపించింది అంబానీనేనని నేరుగా ఆరోపించిన జగన్.. ఇలా ఆ అంబానీనే పిలిచి.. రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడం… ఆలింగనాలు చేసుకోవడం… సోషల్ మీడియానే కాదు.. వైసీపీ అభిమానులను కూడా నోరెళ్లబెట్టేలా చేసింది. ముఖ్యంగా జగన్ రాజకీయ వైఖరిని బయట పెట్టినట్లయింది.
అమరావతి రైతులకు నిత్య నరకం…!
అమరావతి బిల్లులను సెలక్ట్ కమిటికీ పంపారని.. ఏకంగా మండలినే రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి.. ఎలా ఉంటుందో.. ఏడాది మొత్తం అమరావతి రైతులు రుచి చూస్తూనే ఉన్నారు. వారిచ్చిన భూముల్లో మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయని అనుకుంటే… బయట వ్యక్తులకు.. సెంటు చొప్పున పంచాలని నిర్ణయం తీసుకున్నారు. అది రైతులను మానసిక వేదనకు గురి చేసింది. ఒప్పందం ప్రకారం కౌలు ఇవ్వకపోవడం దగ్గర్నుంచి రైతుల్ని ప్రభుత్వం ఎంతగా మానసిక వేదనకు గురి చేయాలో అంతగా చేసింది. ఈ కారణంగా వంద మందికిపైగా భూములు ఇచ్చిన రైతులు.. ఏడాది కాలంలో కన్నుమూశారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అమరావతిని ఎడారిగా స్మశానంగా పేర్కొంటూ.. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. ఉద్యమాలు చేస్తున్న మహిళా రైతుల్ని కించ పరిచారు. వారి వస్త్రధారణను అవమానించారు. అమరావతి మహిళలపై అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లుగా దూషణలకు దిగారు. రైతులు వీటన్నింటినీ తట్టుకుని ఏడాది ఉద్యమాన్ని కొనసాగించారు. చివరికి ఏడాది అయిన సందర్భంగా జనభేరీ సభ నిర్వహించుకుంటే.. ప్రభుత్వం పోటీగా బీసీ సంక్రాంతి పేరుతో సభ ఏర్పాటు చేసింది. ఈ అవమానాలు.. వేధింపులన్నింటినీ తట్టుకుని.. రైతులు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. 2020 వారి జీవితంలోనే కాదు.. అమరావతి చరిత్రలోనే చెరిగిపోని జ్ఞాపకాలు మిగిల్చింది.
రికార్డు స్థాయి అప్పులతో 2020 రికార్డు
2020 జనవరి నుంచి డిసెంబర్ వరకూ చేసిన అప్పు… అటూ ఇటూగా లక్ష కోట్లు దాటింది. అంటే.. ఐదు కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరినెత్తిపై ఇరవై వేల రూపాయల అప్పు పెట్టారు. ఇంత అప్పు చేసి ఏమైనా సంపద సృష్టించారా అంటూ… నలుదిక్కులా చూడాల్సిన పరిస్థితి. పోలవరం ప్రాజెక్టుపై ఏడాది మొత్తంలో పెట్టిన ఖర్చు రెండు వదల కోట్లు దాటలేదు. అమరావతిలో మొత్తం నిలిపివేశారు. రోడ్ల నిర్వహణకు ఏటా కేటాయించాల్సిన మూడు వందల కోట్లను కూడా కేటాయించకపోవడంతో.. రోడ్లన్నీ గుంతలు తేలిపోయాయి. అంటే.. లక్ష కోట్లు అప్పు టేసినా.. ఒక్కటంటే.. ఒక్క రూపాయి సంపద సృష్టి కాలేదు. అసలు రైతులు కష్టాల్లో కూడా ఊహించని విధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేస్తున్నారు. పోనీ సంక్షేమం అన్నా సరిగ్గా సాగుతుందా అంటే అదీ లేదు. లబ్దిదారుల సంఖ్యను రాను రాను తగ్గించేస్తున్నారు. చివరికి అప్పులివ్వడం లేదని బ్యాంకుల ముందు చెత్త వేసే పరిస్థితి.
పోలీసుల పని తీరు వివాదాస్పదం
పోలీసు వ్యవస్థ.. రాజకీయ కక్ష సాధింపులకే పరిమితమయింది. ఎంత దారుణమైన పనితీరును పోలీసులు చూపిస్తారంటే.. దిశ అనే చట్టం లేకపోయినా ఉన్నట్లుగా.. ఆ ప్రకారం కేసులు పెడుతున్నట్లుగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూంటారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై పట్టపగలు దాడులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెగబడుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా.. అధికార పార్టీని ఎవరైనా వ్యతిరేకించారంటే.. వారికి గ్యారంటీ లేని పరిస్థితి. తిరుపతిలో అభం శుభం తెలియని పసిగుడ్డుపై అత్యాచారం హత్య దగ్గర్నుంచి నిన్నటి అనంతపురం దిశ ఘటన వరకూ.. కొన్ని వందల ఘటనలు జరిగాయి. కానీ ఏ ఒక్కరికి శిక్ష పడిన దాఖలాలు లేవు. నిందితులు నిర్భయంగా తిరుగుతూ ఉంటారు. దళితులపై ఎప్పుడూ జరగనన్ని దాడులు జరిగాయి. ఏలూరులో ప్రజల అనారోగ్యానికి వింత అనే పేరు పెట్టేసి సైలెంటయింది. అసలు కారణాలు కనుక్కోలేకపోయింది.
ఒక్క సామాజికవర్గానికి గోల్డెన్ ఇయర్..!
కాంట్రాక్టుల్లో రివర్స్ కాంట్రాక్టులు చేపట్టినట్లుగా తాము అధికారంలోకి రాగానే ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారందర్నీ తొలగించేసి.. కొత్త వారిని నియమించిన కొత్త ప్రభుత్వం. ఇందులో రెడ్డి వర్గానికి సామాజిక న్యాయంచేసింది. రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలు ఉంటారు అందరికీ ఇచ్చే ప్రభుత్వ పథకాల సొమ్మును బీసీలకే ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తూ.. మోసం చేయడం.. 2020లో కొత్త ట్విస్ట్. 2020లో సంక్షేమ పథకాల కోసం బీసీలకు కేటాయించాల్సిన సొమ్ము దాదాపుగా పదకొండు వేల కోట్లను దారి మళ్లించారు. బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. చైర్మన్లను.. సభ్యులను నియమించారు. వారికి పదో పరకో జీతం నిర్ణయించారు. కానీ వారికి నిధులు విధులు ఉండవు. కార్పొరేషన్ల ఖాతాల్లో మాత్రం.. అమ్మఒడితో పాటు ఇతర పథకాల నిధులు చూపి.. అదే సాయం అని అనుకోమనే పరిస్థితి.. సరికొత్త టెక్నిక్‌ను 2020లో ప్రభుత్వం కనిపెట్టింది.
న్యాయవ్యవస్థపై దాడులు..!
2020లో ఆంధ్రప్రదేశ్ .. దేశం మొత్తానికి ఓ గుణాత్మకమైన మార్పు తీసుకు వచ్చి చూపించింది. కాకపోతే ఇది పాజిటివ్‌గా కాదు నెగెటివ్‌గా. ఇంత కాలం.. రాజ్యంగ వ్యవస్థల్లో అత్యంత బలంగా ఉందనుకున్న న్యాయవ్యవస్థను తల్చుకుంటే.. ఎంత బేలగా మార్చవచ్చో.. ఏపీ సర్కార్ నిరూపించింది. అసువుగా న్యాయవ్యవస్థపై బురద చల్లేసి… ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేసింది. తమకు నచ్చిన తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై కులం.. మతం.. రాజకీయ పార్టీల ముద్రలు వేసేశారు. తప్పుడు ఆరోపణలు చేసి.. లేఖలు రాసి మీడియాలో ప్రచారంలో పెట్టారు. ఆరోపణలు నిజమని తేలుతాయో లేదో కానీ… ప్రచారం చేసి ప్రజల్లో వ్యవస్థ పునాదుల్ని బలహీనం చేయడానికి చేయాల్సినంత చేశారు. ఆ
ప్రతీ నిర్ణయంలోనూ యూటర్నే..!
ప్రతిపక్షంలో ప్రభుత్వంపై ఏ ఏ అంశాల్లో తీవ్రమైన ఆరోపణలు చేశారో.. అలాంటి అంశాల్లో ప్రభుత్వం మరింత అడ్వాన్స్‌గా ముందుకెళ్లింది. తాము గతంలో అలా అన్నామని.. ప్రజలు నోళ్లు నొక్కుకుంటారనే ఆలోచన కూడా చేయలేదు. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ విషయాల్లో పాతికేళ్లు పీపీఏలు చేసుకోవడాన్ని తీవ్రమైన అవినీతిగా ప్రమాణస్వీకార వేదికపై నుంచి ఆరోపణలు చేసిన జగన్ .. .ఈ ఏడాది 30 ఏళ్లకు పీపీఏలు చేసుకోవాలని నిర్ణయించారు. అక్కడ్నుంచి ఆ యుటర్న్‌లు సాగుతూనే ఉన్నాయి. చివరికి జీఎంఆర్ఎయిర్ పోర్టు.. దివీస్ పరిశ్రమ విషయంలోనూ అదే యూటర్న్. 2020లో రాజకీయ వైపరీత్యాలే కాదు.. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏపీని వెంటాడాయి. మూడు సార్లు తుపానులు వచ్చాయి. నివర్ తుపాను దెబ్బకు రైతులు నష్టపోయారు. కరోనా దెబ్బకు ప్రజలంతా నష్టపోయారు.