జగపతిబాబు అంటే ఒకప్పుడు రొమాంటిక్ పాత్రలే గుర్తొచ్చేవి. ఇప్పుడాయన విలన్ అయిపోయి.. ఆ పాత్రలకు పూర్తిగా దూరం అయ్యాడు. ఇప్పుడు చాలా కాలం తరవాత… తనదైన స్టైల్ లో రొమాన్స్ చూపించడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమానే.. `FCUK `.
కార్తీక్ రామ్, అమ్ము అభిరామి జంటగా నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకుడు. జనవరి 1 సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం నిడివి గల ఈ టీజర్లో ప్రధాన పాత్రల్ని పరిచయం చేశారు. నాలుగు పాత్రల్లో.. అందరినీ తన వైపుకు తిప్పుకున్నది మాత్రం జగపతిబాబు పాత్రే. కొడుకుకి పిల్లని చూసి. పెళ్లి చేయాల్సిన వయసులో – చెల్లిని తీసుకొచ్చేంత రొమాంటిక్ పాత్ర ఇది. తన చేష్టలతో… `బండి ఇంకా కండీషన్లోనే ఉంది` అని అందరిచేతా అనిపించుకొనేంత రొమాంటిక్ గా ఆ పాత్రని తీర్చిదిద్దారు. జగ్గూ భాయ్ బాడీ లాంగ్వేజ్,క్యారక్టరైజేషన్ చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. ఈసినిమా మొత్తానికి అదే ప్రధాన ఆకర్షణ అనిపిస్తోంది. వరుసగా విలన్ పాత్రలు చేస్తున్న జగపతి బాబుకి.. ఇదో ఆటవిడుపు అనుకోవాలి.