2020 వెళ్లిపోయింది. ఇప్పుడు 2020 ఓ చరిత్ర. ఈ క్యాలెండర్ చిత్రసీమకు ఏమాత్రం కలసి రాలేదు. కరోనా పుణ్యమా అని వెండి తెరపై బొమ్మ పడలేదు. ఓటీటీలో కొన్ని సినిమాలు వచ్చినా – జనాదరణకు నోచుకున్నవి తక్కువే. షూటింగులు లేక, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు లేక… చిత్రసీమ వెలవెబలోయింది. బాక్సాఫీసు కళాహీనంగా తయారైంది. 2021లో పరిస్థితి మారబోతోంది. 2021 లెక్కే వేరుగా ఉండబోతోంది. ఎందుకంటే.. కరోనా భయాలు తగ్గాయి. థియేటర్లు తెరచుకున్నాయి. కొత్త సినిమాలు వస్తున్నాయి. 2021లో వడ్డీతో సహా రాబట్టడానికి టాలీవుడ్ సిద్ధమవుతోంది. మరి 2021లో చూడదగ్గ సినిమాలేంటి? ఏ సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాయి..?
RRR
టాలీవుడ్ నే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమ ఆసక్తిగా ఈ సినిమా కోసమే ఎదురు చూస్తోంది. బాహుబలి తరవాత… రాజమౌళి నుంచి వస్తున్న మరో సినిమా ఇది. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్. ఈ సినిమా ఎందుకు చూడాలి? అనే దానిపై పెద్దగా చర్చ అవసరం లేదు. 2020లో రావాల్సిన సినిమా ఇది. కరోనా వల్ల.. ఆలస్యం అయ్యింది. 2022 సంక్రాంతికే వస్తుందని అంతా ఫిక్సయిపోయారు. కానీ.. ఈ సినిమాని ఎలాగైనా సరే, దసరాకి విడుదల చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. ఈ యేడాది ఏప్రిల్, మే నాటికి షూటింగ్ పూర్తి చేసి, వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 350 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. మొత్తమ్మీద 700 కోట్లు రాబట్టాలన్నది దర్శక నిర్మాతల వ్యూహం.
ఆచార్య
చిరంజీవి – కొరటాల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇప్పటి వరకూ పరాజయం అంటూ ఎరుగని దర్శకుడు కొరటాల. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన జోరు చూపిస్తున్నాడు మెగాస్టార్. వీరిద్దరి కాంబో అంటే… అంచనాలు ఆకాశంలో ఉంటాయి. పైగా. రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తండ్రీ తనయులిద్దరినీ వెండి తెరపై చూడడం మెగా అభిమానులకు పండగే. ఈ యేడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. తన సినిమాలో ఏదో ఓ సామాజిక అంశాన్ని సృశించడం.. కొరటాల స్టైల్. ఈసారీ అంతే. దేవాదాయ భూములు, నక్సలిజం నేపథ్యంలో సాగే కథ ఇది. మరి ఈసారి దానికి ఎలాంటి టచ్ ఇస్తారో చూడాలి.
రాధే శ్యామ్
ప్రభాస్ సినిమా అనే ట్యాగ్ లైన్ చాలు. అంతకంటే వేరే అర్హత అవసరం లేదు. దర్శకుడు ఎవరైనా సరే, ఎలాంటి జోనర్ అయినా సరే, అది పాన్ ఇండియా సినిమా అయిపోతోంది. `రాధే శ్యామ్` కూడా అంతే. ఏళ్ల తరబడి… సెట్స్‌పై ఉన్న సినిమా ఇది. అయినా సరే, దాని ఇమేజ్, క్రేజ్ తగ్గలేదు. ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. `సాహో` నిరుత్సాహ పరిచినా, వసూళ్లు మాత్రం అదరగొట్టేశాయి. `రాధే శ్యామ్`కి కాస్త పాజిటీవ్ బజ్ వస్తే చాలు. వసూళ్ల వర్షం కురవడం ఖాయం. చిత్రసీమ భారీ ఆశలు పెట్టుకున్న సినిమాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. మరి ప్రభాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, ఏమో..?
ఎఫ్ 3
ఎఫ్ 2తో వెంకటేష్ – వరుణ్‌తేజ్‌లు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు.. ఎఫ్ 3కి రంగం సిద్ధం చేసేశాడు అనిల్ రావిపూడి. ఇటీవలే ఈ సినిమా క్లాప్ కొట్టుకుంది. అత్యంత వేగంగా ఈ సినిమా పూర్తి చేయాలన్నది దిల్ రాజు ఆలోచన. కేవలం 4 నెలల్లో ఈచిత్రాన్ని సిద్ధం చేస్తార్ట. వేసవిలో రావడం కష్టం గానీ, దసరాకి ఈ సినిమా చూసేయొచ్చు. పండగ సీజన్. పైగా ఫ్యామిలీ డ్రామా.. అంతకు మించి.. ఎఫ్ 2 ఫ్రాంచైజీ… ఇంతకంటే ఏం కావాలి? పైగా అనిల్ రావిపూడి కూడా అపజయం ఎరుగని దర్శకుడే. కుటుంబం అంతా థియేటర్లకు రావాలంటే ఎఫ్ 3 లాంటి సినిమా ఒకటి పడాల్సిందే.
వకీల్ సాబ్
సుదీర్ఘ విరామం తరవాత.. పవన్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన `పింక్` చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే `పింక్` సినిమాని చాలామంది చూసేశారు. కాకపోతే పవన్ కోసం ఎలాంటి మార్పులు చేశారు? అమితాబ్ లాంటి లెజెండరీ నటుడు పోషించిన పాత్రలో పవన్ ఎలా ఇమిడిపోయాడు? అనే ఆసక్తి ప్రేక్షకులకు ఉంటుంది అది సహజం. పైగా పవన్ రీ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందన్న ఉత్సుకత తో అయినా సరే.. ఈ సినిమా తప్పకుండా చూస్తారు. కరోనా కరణంగా షూటింగు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు పూర్తయ్యింది కూడా. ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. వేసవిలో చూడొచ్చు.
కేజీఎఫ్ చాప్టర్ 2
కేజీఎఫ్ తెలుగు సినిమా కాదు. కన్నడ సినిమా. అయినా సరే, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. దక్షిణాదిన దుమ్ము రేపిన ఈ చిత్రం.. బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తోంది. కేజీఎఫ్ కంటే ఈ సినిమాలో హంగులు ఎక్కువగా ఉన్నాయి. సంజయ్‌దత్ లాంటి స్టార్లు కలిశారు. తెలుగు ప్రేక్షకుల కోసం.. తెలుగు నేటివిటీ కోసం మన నటీనటులకూ ఈ చాప్టర్ లో చోటిచ్చారు. ఈ వేసవిలో.. కేజీఎఫ్ 2 ని చూడొచ్చు.
వీటితో పాటు నారప్ప. క్రాక్, రెడ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, టచ్ జగదీష్, ఫైటర్, విరాటపర్వం లాంటి క్రేజీ సినిమాలూ ఈ యేడాదే విడుదల కాబోతున్నాయి. చూస్తుంటే 2021 తెలుగు సినిమా క్యాలెండర్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. వీటిలో సగం సినిమాలు హిట్టయినా సరే… 2020 లోటుని భర్తీ చేసినట్టే.