ఆలయాలపై దాడులు జరుగుతూంటే… భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ ఆలయాలపై దాడులు వంటి వాటిపై స్పందించారు కానీ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కాలేదు. అది ఆయన తరహా రాజకీయం కాదు. కానీ ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులు.. పోలీసులు ఎక్కడా నిందితుల్ని పట్టుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ఆలసత్వం వహించి నిర్లక్ష్యం చేస్తే ఇంకా పెరిగిపోతాయన్న భావనతో… స్వయంగా రంగంలోకి దిగారు. విజయనగరం రామతీర్థం ఆలయాన్ని పరిశీలించబోతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకూ..కేసులు పెట్టింది లేదు. పిచ్చివాళ్లు చేశారని లెక్కలేశారు. అంతర్వేది రథం దగ్ధం… విజయవాడలో మూడు సింహాల మాయం వంటి ఘటనల్లో ఎన్ని విచారణలు వేసినా నిందితులు తేలలేదు. ఇంత పెద్ద విషయాలపై బీజేపీ కూడా మౌనం పాటిస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చంద్రబాబు విజయనగర పర్యటన ఖరారైన తరవాత.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ట్విట్టర్ ద్వారాఓ ప్రకటన చేశారు. దాని సారాంశం… హోంమంత్రి సుచరిత.. బాధ్యత తీసుకోవాలి. దాడులు జరుగుతున్నా… ఆమె పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు ఆరోపణ.
సోము వీర్రాజు ప్రకటన.. డిమాండ్ చూసి.. వైసీపీ వర్గాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాయి. హోంమంత్రిగా ఉన్న సుచరిత కనీసం రోజువారీ విధులు కూడా నిర్వహించడం లేదని… దిశ చట్టంద్వారా ముగ్గురికి ఉరి శిక్ష వేశామని ప్రకటించినప్పుడే తేలిపోయిందంటున్నారు. ముఖ్య సలహాదారు మొత్తం హోంమంత్రి, డీజీపీ అధికారాల్ని గుప్పిట పట్టి బండి నడిపిస్తున్నారని అంటున్నారు. ఆయనే ఈ విమర్శలపై ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం కూడా ఇచ్చారు. కానీ సోము వీర్రాజు మాత్రం.. సుచరితను టార్గెట్ చేస్తున్నారు. వీర్రాజు సీఎం జగన్‌కి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్లో సెటైర్లు వేశారు.