ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 160కిపైగా ఆలయాల్లో ఈ తరహా దాడులు జరిగాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని తల వరకూ ఛేదన చేసిన వ్యవహారం మరింత దుమారం రేపుతోంది. అసలు ఎవరు చేశారు..?ఎందుకు చేశారన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. అయితే అది రాజకీయం. కానీ ఆధ్యాత్మిక వేత్తలు. హిందువులు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యవస్థలు ఏమైపోయాయని అడుగుతున్నారు.
త్రిదండి చినజీయర్ స్వామి రామతీర్థం ఘటనపై నేరుగా స్పందించారు. ఆలయాల్ని రక్షించే బాధ్యత ఉన్న ప్రభుత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. ఆ ఆలయాన్ని .. రాముల వారిని ఆసరాగా చేసుకుని ఓ వ్యవస్థ ఉందని… వారేమైపోయారని ఆయన ప్రశ్నించారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నవారు.. రక్షించాల్సిన వారు ఎందుకు నిమిత్తమాత్రులుగా మారారని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో భక్తులు ప్రశ్నించడానికి భయపడకూడదని ఆయన అంటున్నారు. వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రశ్నించాలని.. ఆయన పిలుపునిచ్చారు. మన కోసం రాముల వారు వచ్చారని.. అలాంటప్పుడు ఆయన బాగోగులు మనం చూసుకోవాల్సిందేనన్నారు. ఎందుకంటే.. విగ్రహ రూపంలో ఆయన అక్కడకు వచ్చింది మన బాగోగులు చూడటానికేనని గుర్తు చేశారు.
రామతీర్థం ఘటనపై చినజీయర్ స్వామి కూడా తీవ్రంగా కలత చెందారని ఆయన స్పందనతోనే తేలిపోయింది. సాధారణంగా ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడితే రాజకీయం చేసే ప్రమాదం ఉంది. అందుకే.. ఆయన సున్నితంగా స్పందిస్తూ ఉంటారు. కానీ అన్నింటికీ మించి రామతీర్థం వ్యవహారం ఉన్మాద స్థాయికి చేరిందన్న విషయం ఆయనకు తేలిపోయింది. ఇక ఉపేక్షిస్తే.. మరింతగా జరుగుతాయన్న అంచనాతో స్పందించారని అంటున్నారు. రామతీర్థం ఆలయం.. చిన్నదే కావొచ్చు కానీ.. శతాబ్దాల చరిత్ర ఉంది. భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడంతో… ఏపీలో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్ట ఆలయంతో పాటు.. విజయనగరం జిల్లాలో రామతీర్థం ఆలయాన్ని కూడా పరిశీలించింది. వివిధ రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఒంటి మిట్టను ఎంపిక చేసుకున్నప్పటికీ.. ఆ ఆలయానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ ఆలయంపైనే గురి పెట్టారు.
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని హిందూత్వంపై జరుగుతున్న దాడిగా.. అందరూ భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది స్వామిజీలు కనీసం.. స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. రాజకీయ ప్రకటనలు చేసే స్వాములు… తాము ఏ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారో.. ఆ వ్యవస్థపైనే దాడి జరుగుతున్నా ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు. ప్రశ్నించి.. ఆలయానికి రక్షణ ఉండేలా చేయలేకపోతున్నారు.