విజయనగరం జిల్లా రామతీర్థం రాములవారి ఆలయం కేంద్రంగా రచ్చ రాజకీయానికి ఎంపీ విజయసాయిరెడ్డి తెర లేపడం.. రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. రాముడి వారి విగ్రహం తల భాగాన్ని ధ్వంసం చేసి.. పక్కనే ఉన్న కొలనులో వేసి వారం రోజులు అయినప్పటికీ… విశాఖలోనే రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న విజయసాయిరెడ్డి ఒక్క సారి కూడా స్పందించలేదు. కానీ.. చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయ పరిశీలనకు వస్తున్నారని తెలిసిన వెంటనే.. ఆయన రచ్చ రాజకీయానికి తెర లేపారు. చంద్రబాబు పర్యటనను పోలీసుల సాయంతో అడ్డుకుంటే.. గతంలోలా అడ్డుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అనుకున్నరేమో కానీ.., ఉద్రిక్తత సృష్టించే వ్యూహం అమలు చేశారు. చంద్రబాబు విజయవాడలో బయలుదేరగానే.. ఇక్కడ విజయసాయిరెడ్డి.., పార్టీ నేతల్ని రామతీర్థం వద్ద మోహరింప చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం హైలెట్ కాకుండా… చంద్రబాబు కుట్రలుచేస్తున్నారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నిజానికి ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు టూర్ లో జోక్యం చేసుకుని విజయసాయిరెడ్డినే.. ఈ కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యతను కల్పించారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారంటే.. ఏదో ఓ రచ్చ చేయడమేనని.. దాని వల్ల అటెన్షన్ తెస్తున్నారని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెడుతున్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు రావడానికి గంటన్నర ముందే రామతీర్థం చేరుకుని.. విజయసాయిరెడ్డి పెద్ద డ్రామాకు తెర లేపారు. పార్టీ కార్యకర్తల్ని మోహరింప చేసి. .మెల్లగా ఆలయంలోకి వెళ్లారు. చంద్రబాబు వచ్చే సమయం చూసుకుని కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరగానే… టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయడం ప్రారంభించారు. చివరికి చంద్రబాబు కాన్వాయ్‌ను విజయనగరంలోకి అనుమతించి.. మిగిలిన వారి వాహనాలను ఆపేశారు. అయితే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి రామతీర్థం చేరుకున్నారు. దీంతో.. రామతీర్థం ఆలయం ఉన్న బోడికొండ వద్ద ఎటు చూసినా టీడీపీ కార్యకర్తలే కనిపించారు. ఈ సమయంలో.. కొండ కిందకు వచ్చిన విజయసాయిరెడ్డి టీడీపీ నేతల్ని.. కార్యకర్తల్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గతంలో చేసిన ఆరోపణలన్నీ మళ్లీ చేస్తూ పోయారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెంది స్థానికులు ఆయన కారుపై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో ఆయన కారులో కూర్చోకుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులు ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు.
చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి… లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లుగా మీడియాకు చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ సవాల్ చేసింది.. జగన్మోహన్ రెడ్డికి. అయితే అదేదో లోకేష్ తనకే సవాల్ చేసినట్లుగా తాను స్వీకరిస్తున్నానని చెప్పుకుని విజయసాయిరెడ్డి హడావుడి చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేసిన సవాల్ పై స్పందించకుండా ఇతర నేతల్ని పంపిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు తనకు సవాల్ చేయకపోయినా.. తాను స్పందించడం ఏమిటని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే జగన్ ను పంపించాలని సవాల్ చేస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి.. పెద్ద రాజకీయ నాయకునిగా.. చంద్రబాబుకు సమఉజ్జీగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతూండటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని వైసీపీ నేతలు కూడా గొణుక్కుంటున్నారు.