విజయనగరం జిల్లా రామతీర్థం రోజంతా రాజకీయ ఉద్రిక్తతలకు కారణం అయింది. చంద్రబాబు పర్యటనను రాజకీయం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పోటీ యాత్ర చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి అది ఆయన కారుపై రాళ్లు, చెప్పులు వేయడానికి కారణం అయింది. రామతీర్థంలోని కొండపై ఉన్న రాముల వారి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తల వరకు విరగ్గొట్టి పక్కనే ఉన్న కొనేరులో దుండగులు వేశారు. ప్రభుత్వం ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడం ఆలస్యం చేయడంతో చంద్రబాబు ఆ ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే.. చంద్రబాబు తమకు వ్యతిరేకంగానే యాత్ర పెట్టుకున్నారని విజయసాయిరెడ్డి అనుకున్నారో లేకపోతే.. విగ్రహ ధ్వంసం పై తమ మీదే అనుమానం వస్తుందనుకున్నారో కానీ.. ఎదురుదాడి ప్రారంభించారు. చంద్రబాబు కంటే ముందే తాను వైసీపీ కార్యకర్తలతో కలిసి రామతీర్థం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
విజయసాయిరెడ్డి నిర్ణయంతో రోజంతా ఉద్రిక్తత ఏర్పడింది. అదే సమయంలో.. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు.. పోలీసులు కూడా శతవిధాలా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర అధికారయంత్రాంగం మొత్తం విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉండటంతో.. రాత్రికి రాత్రి కొత్త కొత్త వ్యూహాలు అమలు చేశారు. ఆలయంలోని రాముల వారి విగ్రహాన్ని టీడీపీ నేతలే ధ్వంసం చేశారని ప్రచారం చేసేందుకు ఇద్దరు టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రామతీర్థానికి టీడీపీ నేతలెవరూ పెద్దగా రాకుండా కట్టడి చేశారు. విశాఖపట్నం నుంచి చంద్రబాబు బయలుదేరిన తర్వాత ఆయన కాన్వాయ్‌ను పంపించేసి…లారీలను అడ్డం పెట్టారు. టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు .. రోడ్డుపై ధర్నా చేశారు. పోలీసుల తీరును నిరసించారు. కాసేపటికి పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో టీడీపీ నేతల వాహనాలను వదిలి పెట్టారు.
టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలియడంతో .. కార్యకర్తలు.. వివిధ రకాల ప్రత్యామ్నాయ రూట్లలో పెద్ద ఎత్తున రామతీర్థం చేరుకున్నారు. దీంతో.. రామతీర్థం కొండ చుట్టూ టీడీపీ నేతలు, కార్యకర్తలే కనిపించడం ప్రారంభమయింది. అప్పటికే విజయసాయిరెడ్డి… కొండ వద్దకు చేరుకున్నారు. ఆయన నడుచుకుంటూ.. కొండ పైకి వెళ్లారు. ఆలయంలో పూజుల చేసి కిందకు వచ్చారు. కిందకు వచ్చి చంద్రబాబు లోకేష్‌పై ఆరోపణలు చేశారు. అశోక్ గజపతి రాజు … రామతీర్థం ఆలయానికి ట్రస్టీగా ఉన్నారని.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్ సవాల్ చేశారని.. తాను సిద్ధమని చెప్పుకొచ్చారు.
అయితే ఆ సమయంలోనే… విజయసాయిరెడ్డి కారుపై రాళ్లు, చెప్పులతో దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు ఆయనక ురక్షణ కల్పించారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో.. అదేదో పార్టీ పరమైన యాత్ర అన్నట్లుగా వైసీపీ జెండాలను విజయసాయిరెడ్డితో పాటు వచ్చే కొంత మంది తీసుకెళ్లడంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తమయింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై 140 దాడులు జరిగితే.. ఒక్క చోటకీ వెళ్లని విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు రామతీర్థానికి వెళ్తున్నాడగానే.. తాను కూడా వెళ్లడం… గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ఉందని… టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.. ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
విజయసాయిరెడ్డి వెనుతిరిగి వెళ్లే సమయానికి చంద్రబాబు నాయుడు.. కొండ వద్దకు చేరుకున్నారు. కొండ కింద కొబ్బరికాయ కొట్టి మెట్ల మార్గం ద్వారా ఇతర పార్టీ నేతలతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఆలయానికి తాళం వేసి ఉంది. విగ్రహం ధ్వంసం చేసిన వివరాలను ఆలయ వర్గాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహం దొరికిన కోనేరును పరిశీలించారు. పదిహేను నిమిషాల పాటు ఆలయంలో ఉన్న చంద్రబాబు తర్వాత కొండ దిగి వచ్చారు.
ఈ లోపు కింద విజయసాయిరెడ్డి కావాల్సినంత హడావుడి చేశారు. లోకేష్‌తో చర్చకు సవాల్ చేశారు. అయితే.. వెంటనే లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తాను జగన్ కు సవాల్ చేస్తే విజయసాయిరెడ్డి స్పందించడం ఏమిటని.. జగన్‌కు ధైర్యం లేదా అని ప్రశ్నించారు. రాముల వారి దర్శనం తర్వతా టీడీపీ నేతలు కొండ కింది భాగంలో సభ ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆలయాలపై దాడులు చేస్తున్నారు. మత మార్పిళ్ల కోసం.. హిందూత్వంపై దాడి చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.