అధికార కిరీటాలు తమ నెత్తి మీద ఉన్నాయని విర్రవీగుతున్న వైసీపీ నేతలు… మంత్రులకు మంచీ , చెడు, సంస్కారం, మర్యాద అనేవి ఏవీ గుర్తు రావడం లేదు. నోటికి ఎంత వస్తే అంత .. ఎవరిని పడితే వారిని తిట్టేస్తున్నారు. ఎవరినైనా ప్రశ్నిస్తే బూతులతో ఎదురుదాడి చేయడంలో వైసీపీ నేతలు మించిపోయారు. కొడాలి నాని మోడీ భార్య గురించి సైతం మాట్లాడేశారు. ఇప్పుడు… వెల్లంపల్లి అశోక్ గజపతిరాజును దారుణంగా తిట్టారు. వెధవ అన్నారు. అశోక్ గజపతిరాజుపై వెల్లంపల్లి వాడిన భాష ఇప్పుడు.. కలకలం రేపుతోంది.
అశోక్ గజపతిరాజు.. ఇప్పటి రాజకీయాల్లో అందరి లాంటి రాజకీయ నేత కాదు. ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా పల్లెత్తు మాట అనరు. ఈ ప్రభుత్వం ఆయనను మానసికంగా కుంగదీసేలా నిర్ణయాలు తీసుకున్నా… ఆయన జగన్ను జగన్ గారనే అంటారు. రాజకీయంగానే మాట్లాడరు. అలాగే.. రాజకీయ నేతల్లో ఆయనది భిన్నమైన శైలి. ప్రస్తుత తరంలో ఒక్క రూపాయి అవినీతి చేయని నిఖార్సైన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే.. అది అశోక్ గజపతిరాజు మాత్రమే. ఈ విషయం ఒక్క విజయనగరం జిల్లా కాదు.. మొత్తం ఏపీకి తెలుసు. మహారాజుల కుటుంబంలో పుట్టి… తన కుటుంబంలో కులాంతర వివాహాలు చేసిన ఆదర్శవ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. ఆయనపై మాట తూలడానికి సందేహిస్తారు.
కానీ… మంత్రి వెల్లంపల్లి హద్దు దాటారు. రాజకీయంగా తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి అశోక్ గజపతిరాజుని తిడుతున్నారు. ఆయనను మానసికంగా ఇబ్బందిపెట్టే వ్యూహంతో వైసీపీ ప్రీ ప్లాన్డ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్న అనుమానాలు టీడీపీలో ఉన్నాయి. వైసీపీ నేతలు అవినీతిని నీతిగా భావిస్తున్నారేమో.. నీతిగా ఉండటాన్ని అవినీతి చేయడంగా తేల్చేసుకున్నారేమో కానీ… కొంత మంది నీతినిజాయితీ ఉన్న నేతల్ని టార్గెట్ చేసుకుని… పరువు, ప్రతిష్టలతో గడిపేవాళ్లను టార్గెట్ చేసుకుని వారిని మానసిక వేదనకు గురి చేసే వ్యూహాల్ని అమలు చేస్తోంది. ఇప్పుడు వారి టార్గెట్ అశోక్ అయ్యారు. కానీ.. ప్రజలు అసహ్యించుకోవడానికే అవకాశం ఉంటుంది. సరైన సందర్భంలో ప్రజలు తమ నిరసన తెలియచేస్తారు.