దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. టీడీపీ నేత అశోక్ గజపతిరాజును వెధవ అని సంబోధించడం… కలకలం రేపుతోంది. అధికార అహంకారంతో అందరిపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతల లిస్టులో వెల్లంపల్లి ఒకరు. అయితే అందరి మీదా అన్నట్లుగానే అశోక్ గజపతిరాజును అనడం ఇప్పుడు.. రాజకీయంగానే కాదు.. సామాజికంగానూ కలకలం రేపుతోంది. క్షత్రియ సామాజికవర్గం వెల్లంపల్లి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. సాధారణంగా క్షత్రియులు హుందా రాజకీయాలనే చేస్తారు. బూతులు.. తిట్ల రాజకీయాల జోలికి వెళ్లరు. వెళ్లినా అవి పరిమితుల్లోనే ఉంటాయి. ముఖ్యంగా రాజ్యాలు ఏలిన వంశీకులు ఇంకా హుందాగా ఉంటారు. వారిపై చేసే విమర్శల విషయంలోనూ.. ఇతర పార్టీల నేతలు అంతే హుందాగా ఉంటారు.
కానీ తొలి సారిగా.. వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు… క్షత్రియులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు హద్దు దాటి విమర్శలుచేస్తున్నారు. రాజకీయంగా ఎదురు తిరిగిదే ఎదుర్కోవచ్చు కానీ.. ఇలా సామాజికవర్గాన్ని గురి పెట్టి విమర్శలు చేయడం ఏమిటన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. క్షత్రియ సంఘాలు ప్రెస్మీట్లు పెట్టి.. వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. క్షత్రియ సామాజికవర్గం మొత్తంపై ఇదో సెంటిమెంట్‌గా మారిపోయేలా కనిపిస్తోంది.వాస్తవానికి ొక్క క్షత్రియుల్లోనే కాదు.., రాజకీయాలపై చర్చ జరిగే ప్రతీ చోటా.. అశోక్ గజపతిరాజుకు సానుభూతి లభిస్తోంది.
ఆయన మంచితనం.. అవినీతి చేయని రాజకీయం.. వారి కుటుంబం చేసిన త్యాగాలు.. ఇలా ్న్ీ.. గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని మంత్రి వెధవ అని తిట్టడం అధికార అహంకారమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఫీడ్ బ్యాక్ ప్రభుత్వానికి చేరితే… వెల్లంపల్లితో క్షమాపణ చెప్పించే అవకాశం ఉంది. అయితే వైసీపీలో నేతలు అందరూ.. స్క్రిప్ట్ ప్రకారమే.. విమర్శలు చేస్తూంటారు. అలా.. వెల్లంపల్లి కూడా పై నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే.. అని ఉంటారని.. క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని కొంత మంది వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.