అతిలోక సుందరి…అనగానే మన్మధజెండాని పైటగా వేసుకుని వయ్యారాలొలికే అందాల రాణి శ్రీదేవి సినీ సౌందర్యోపాసకుల కళ్ళవాకిళ్ళలో చటుక్కున మెదుల్తుంది. కాటుక కళ్ళతో కాటేసే చూపులు, వెన్నెల చిరునవ్వులు, సొగసు సోయగాల గాలాలతో ఒకప్పటి యువ హృదయాలను కట్టి పడేసిన అందానికి అందం తాను. ఎన్నటికీ ఇగిరి పోని శ్రీగంధంలాంటి శ్రీదేవికి మరణం లేనేలేదు. వీక్షకుల గుండెల్లో సదా ఆమె కొలువై ఉంటుంది.
ఆ అతిలోక సుందరి అసలు సిసలైన వారసురాలు జాన్వీ కపూర్. జాన్వీ కూడా తల్లికి తీసిపోని అందంతో సినిమాల్లోకి రాకముందే మెస్మరైజ్ చేస్తూనే ఉంది. అయితే, జాన్వీ తెరంగేట్రం తెలుగు ఇండస్ట్రీతోనే ఉంటుందని అప్పట్లో భావించారంతా. ఆమెని తమ చిత్రం ద్వారా పరిచయం చేయాలని ఉవ్విళ్ళూరిన నిర్మాత దర్శకులెందరో? ఆమె తమకు జతగా స్క్రీన్ షేర్ చేసుకుందామని కలలు కన్నా తెలుగు కథానాయకులు మరెందరో?
కానీ.. ఆమె బాలీవుడ్ లోనే దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయినా పట్టు వదలని విక్రమార్కులవలె తెలుగు సినిమా ప్రముఖులు ఆమె కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ రీమేక్ లో తెలుగు హీరోతో?
తెలుగు సినిమాలకు కాల్షీట్ ఇవ్వకపోయినా జాన్వీ తెలుగు హీరోతో నటించనుందని తాజా సమాచారం. ఓ తెలుగు హీరో నవతరం అతిలోక సుందరితో నటించే అవకాశాన్ని అందుకున్నారన్న విషయం ఇప్పుడు హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే-
దర్శక ధీరుడని అభిమానులతో ఆత్మీయంగా పిలిపించుకునే రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సంచలన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ కి వినాయక్ దర్శకత్వం వహిస్తారని భోగట్టా. కాగా, ఈ సినిమాలో మొదట అనేక మంది బాలీవుడ్ నాయికల పేర్లు పరిశీలనకు వచ్చాయని తెలుస్తోంది. హీరో గా మాత్రం బెల్లం కొండ శ్రీనివాస్ ని ఇప్పటికే ఎంపిక చేశారట. నిర్మాత కుమారుడైన బెల్లం కొండ శ్రీనివాస్ తన సినిమాల్లో అగ్ర కథానాయికలతోనే నటిస్తుంటారు. అల్లుడు శ్రీను చిత్రంలో సమంతకి జతగా నటించిన ఆయన అదే చిత్రంలో తమన్నా ని ఓ స్పెషల్ సాంగ్ లో నర్తింప చేసారు. ఇలా…తన చిత్రాలకు ఓ ఇమేజ్ ని సెట్ చేసుకుంటారని ఇండస్ట్రీ టాక్.
ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న ఛత్రపతి సినిమాకి నాయికగా జాన్వీని ఎంపిక చేయాలని యూనిట్ భావిస్తోందట. తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం, వినాయక్ పేరున్న డైరెక్టర్ కావడంతో జాన్వీ ఈ ఆఫర్ ని అంగీకరిస్తుందని అనుకునుటున్నా… మరికొందరు మాత్రం అంతగా విశ్వసించడం లేదు. జాన్వీ కనుక ఈ చిత్రం లో నటిస్తే బెల్లంకొండ శ్రీనివాస్ క్రేజ్ మరింత పెరిగినట్లేనంటున్నారు విశ్లేషకులు.