ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ ఏర్పడినప్పటి నుండి.. ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి..? ఎవరు చేస్తున్నారనేది..? ఇంత వరకూ బయట పెట్టలేదు. చాలా కేసుల్లో పిచ్చివాళ్ల మీదకు పోలీసులు నెట్టేశారు. ప్రతిపక్షాలు.. అధికార పార్టీ మీద. .అధికార పార్టీ ప్రతిపక్షాల మీద.. పోలీసులు పిచ్చి వాళ్ల వైపు చూపిస్తూ… టైం పాస్ చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదన్న చర్చ .. విమర్శలు జోరుగా సాగుతున్నాయి. దీంతో.. మూడు రోజుల క్రితం.. దేవుడు జోలికెళ్తే ఆయన సహించడని హెచ్చరించారు. ఈ స్పందన… మరో రకంగా ప్రజల్లోకి వెళ్లింది. ఆయన చేతులెత్తేశారన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. దీంతో ఈ సారి మరింత వివరంగా స్పందించారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా.. ఆన్ లైన్ ప్రసంగంలో చాలా సేపు ఈ అంశాలను రాసుకొచ్చి. చూసి చదివి వినిపించారు.
ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన దాని ప్రకారం… తెలుగుదేశం పార్టీనే ఈ ఘటనలన్నీ చేస్తోంది. ఎందుకు చేస్తోంది అంటే… ఏపీ సర్కార్ కు పబ్లిసిటీ రాకుండానట. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందడానికి ఎవరైనా చేస్తున్నారేమోనని ఇప్పటి వరకూ అందరూ భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి విశ్లేషణలో మొదటి అంశం.. పబ్లిసిటీ రాకుండా చేయడం. దానికి జగన్ చాలా కారణాలు వివరించారు. తాను ఏ ఏ పథకాలు ప్రవేశ పెట్టి.. ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి… మీట నొక్కి.. డబ్బులు రిలీజ్ చేస్తున్నప్పుడు.. ఏ ఏ దాడులు జరిగాయో.. ఏ ఏ అల్లర్లు చోటు చేసుకున్నాయో వివరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అంత విపులంగా ఎక్కడెక్కడ ఘటనలు జరిగాయో కూడా వివరించారు మరి.
మరి ముఖ్యమంత్రికి అంత స్పష్టత ఉన్నప్పుడు.. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ఇప్పుడు..చర్చనీయాంశం అయింది. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఆలయాలు.. ఎండోమెంట్ పరిధిలోనికి రానివేనని సీఎం చెబుతున్నారు కానీ.. బిట్రగుంట నుంచి అంతర్వేది వరకూ అన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వచ్చేవే. ధర్మకర్తగా అశోక్ గజపతి ఉన్నంత మాత్రాన ఉద్యోగులంతా ఆయన మాట వినరు. ఏదైనా ఉత్సవాలు జరిపితే.. గౌరవ మర్యాదలు మాత్రమే దక్కుతాయి. కానీ.. జగన్ మాత్రం.. టీడీపీ నేతలే కావాలని చేస్తున్నారు.. అదీ కూడా తన సంక్షేమ పథకాల పబ్లిసిటీ రాకుండా చేస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. పబ్లిసిటీ కోసం పేజీల కు పేజీలు ప్రకటనలు ఇచ్చుకుంటూ.. సోషల్ మీడియాలో ఎవరికీ అంతనంత విభిన్న వ్యూహాలతో ప్రచారం చేస్తూ.. ఇంకా… ప్రతిపక్షం కుట్రల వల్ల పబ్లిసిటీ రావడం లేదని జగన్ ఫీలవడం… ఆశ్చర్యం కలిగించకుండా ఎలా ఉంటుంది..?