కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో కూల్చివేతలు, అరెస్టులు చేయడంలో మాస్టర్స్ చేసిన ఏపీ సర్కార్ వ్యూహాలు.. చాలా మందిని భయపెడుతున్నాయి. హిట్‌లిస్ట్‌లో ఉన్న వారు మరింతగా భయపడుతున్నారు. ఆ జాబితాలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ … ఏబీ వెంకటేశ్వరరావు కూడా చేరారు. వీకెండ్లో అరెస్ట్ చేసి..కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా.. నలభై ఎనిమిది గంటల పాటు పోలీసు కస్టడీలో ఉన్న కారణం చూపి.. మరోసారి సస్పెండ్ చేసేందుకు కుట్ర పన్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. అందుకే.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఏబీ వెంకటేశ్వరరావుకు తనపై జరుగుతున్న కుట్రల విషయంలో సమాచారం అంది ఉంటుందని.. అందుకే ఆయన ఈ తరహా పిటిషన్ వేశారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వం మారిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోగా.. తర్వాత సీరియస్ అభియోగాలు మోపి కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఆయన న్యాయపోరాటం చేసినా.. సాంకేతిక సమస్యలు వస్తాయని.. సుప్రీంకోర్టు సస్పెన్షన్ రద్దు చేయలేదు. అయితే.. ఆయనపై అభియోగాలను సమయం ప్రకారం నమోదు చేయాలని ఆదేశించింది. కానీ ఏపీ సర్కార్ చివరికి.. ఆయనపై మోపిన అభియోగాల్లో తీవ్రత తగ్గించాల్సి వచ్చింది. చివరికి రూ. పది లక్షల నష్టం కలిగించారని సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. నిజానికి ప్రభుత్వం చెబుతున్న పరికరాలు … అసలు కొనుగోలు చేయలేదు. కొనుగోలు కోసం చేసిన ప్రక్రియ కమిటీ మధ్యలోనే పని ఆపేసింది. ఆ కమిటీలో ఏబీ స భ్యుడు కాదు. అయినప్పటికీ.. ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో.. న్యాయపోరాటంలో తనదే విజయం అని నమ్ముతున్నారు.
ఇలాంటి సమయంలో.. ఏపీ ప్రభుత్వం మళ్లీ తనపై కుట్ర చేస్తుందని… నిబంధనల ప్రకారం ఎవరైనా ఉద్యోగి అరెస్ట్ అయి నలభై ఎనిమిది గంటలు పోలీస్ కస్టడీలో ఉంటే… ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతారు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని…తనను వీకెండ్ లో అరెస్ట్ చేసి.. కోర్టుల్లో ఎలాంటి ఆదేశాలు రాకుండా చేసుకుని 48 గంటల పాటు కస్టడీలో ఉండేలా చేసి మరోసారి సస్పెండ్ చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. వీకెండ్లో కూల్చివేతలకు పాల్పడుతూ… వారంతాల్లో కోర్టులు పని చేయాలన్న డిమాండ్లను.. వచ్చేలా ఇటీవలి కాలంలో వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు.. ఇదే వీకెండ్… వ్యూహం అమలు చేయకుండా.. విరుగుడుగా ఏబీ ముందస్తుగా కోర్టుకెళ్లారు. కోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందో.. షాక్ వస్తుందో కానీ.. మొత్తానికి ఏపీ సర్కార్ కోర్టులకు వెళ్లే చాన్స్ లేకుండా వీకెండ్ వ్యూహాన్ని అమలు చేస్తున్న ఏపీ సర్కార్ వ్యూహం మాత్రం.. కొంత మందిని ఆందోళనకు గురి చేస్తోంది.