ఆంధ్రప్రదేశ్‌లో పోటాపోటీగాటెంపుల్ రన్ ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా ఈ జాబితాలో స్వామిజీలు చేరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత ఆత్మీయుడైన స్వామిజీగా పేరు గాంచిన త్రిదండి చినజీయర్ స్వామి ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాడులకు గురైన ఆలయాలన్నింటినీ చినజీయర్ స్వామి పరిశీలిస్తారని.. ఆలయాల పరిరక్షణకు ఆసక్తి ఉన్న వారందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే రామతీర్థం ఆలయంలో.. రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై… చినజీయర్ ఘాటుగా స్పందించారు. వ్యవస్థలు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆయన స్పందన అందరికీ నచ్చడంతో… ఆలయాల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం జరిగింది. 150కిపైగా ఆలయాలు ధ్వంసం అయ్యాయని.. విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆలయాలు అందులో కొన్నే ఉంటాయి. ఇక ముఫ్పై ఆలయాల వరకూ అలాంటివి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చినజీయర్..వీటిని సందర్శించే అవకాశం ఉంది. ఇది ఒక్క రోజులో కాక.. ఓ యాత్రలా చేసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆలయాల పరిరక్షణపై ఆసక్తి ఉన్న వారందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు.
చినజీయర్ స్వామి ఆలయాల యాత్ర చేస్తే.. ఇతర స్వామిజీలు కామ్‌గా ఉండే అవకాశం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు .. ఏమైనా చేసేందుకు స్వరూపానంద లాంటి స్వాములు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే స్వామిజీలు చాలా మంది ఉన్నారు. వారు కూడా యాత్రలు చేసే అవకాశం ఉంది. ఇక రాజకీయాలు కూడా… ఇదేదో బాగుందనుకుని యాత్రలు ప్రారంభిస్తే.. టెంపుల్ రన్ …కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు. అభివృద్ధి లాంటివన్నీ పక్కకుపోయి… ఆలయాలు, చర్చిలు మాత్రమే చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.