తాడిపత్రిలో రచ్చ చేసి… రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని… సీఎం జగన్ పిలిపించి చీవాట్లు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కత్తులు, కటార్లతో వెళ్లి రచ్చ చేయడం.. అది మొత్తం సీసీ కెమెరాల్లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇరు వర్గాలపై కేసులు పెట్టారు. ఆ వ్యవహారం అలా నడుస్తూండగానే.. జేసీ బ్రదర్స్ దీక్షలు చేశారు. దీంతో తాడిపత్రిలో రోజూ ఉద్రిక్త వాతావరణమే ఉంటోంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించి శాంతి భద్రతల్ని పరి రక్షించాల్సి వస్తోంది. ఈ ప రిణామాలపై.. ఇంటలిజెన్స్ నుంచి రిపోర్ట్ అందిందేమో కానీ.. ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
పెద్దారెడ్డిని హుటాహుటిన పిలిపించుకుని జరిగిన ఘటనపై వివరణ తీసుకున్నారు. స్వయంగా జగన్ పెద్దారెడ్డితో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి… తాను మాట్లాడటానికే వెళ్లినట్లుగా సీఎం జగన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కానీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదని చెప్పి పెద్దారెడ్డిని పంపేశారు. అయితే.. అనంతపురం జిల్లాకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణకు పార్టీ పరమైన బాధ్యతలు ఉండటంతో.. ఆయనను కూడా సమావేశానికి పిలిచారు.
జిల్లాలో ఏం జరుగుతుందో.. సీఎం జగన్ తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ నేతలతో ఆ మాత్రం దూకుడుగా ఉండకపోతే.. కష్టమన్న అభిప్రాయం అనంతపురం నేతలు వ్యక్తం చేస్తున్నారని… వైసీపీ హైకమాండ్‌కు నివేదికలు అందాయి. అయితే ప్రభుత్వ ఇమేజ్ను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. అలా కత్తులు, కటార్లతో ఇళ్లపైకి వెళ్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనుకుంటారని… ఇప్పటికైనా సున్నితంగా డీల్ చేయాలని చెప్పి పంపించినట్లుగా భావిస్తున్నారు.