తమిళనాట థియేటర్ ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ… అక్కడి ప్రభుత్వం జీవోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు. కోవిడ్ భయాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, విపక్షాల నుంచి విమర్శల దాడి ఎక్కువైన ఈ తరుణంలో.. తమిళనాడు ప్రభుత్వం వెనకడుగు వేసింది. అంతేకాదు.. కేంద్రం నుంచి కూడా జీవోని వెనక్కి తీసుకోవాలన్న ఒత్తిడి వచ్చింది. దాంతో.. ఈ జీవోని రద్దు చేశారు.
ఈ సంక్రాంతికి తమిళనాట `మాస్టర్` విడుదల కాబోతోంది. విజయ్ నటించిన ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాలని కోలీవుడ్ ప్రముఖులు తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో.. ప్రభుత్వం సరే అంది. జీవో తెచ్చింది. అయితే విపక్షాలు మాత్రం పట్టుపట్టాయి. `కోవిడ్ ని ప్రోత్సహిస్తున్నారా` అంటూ దుయ్యబట్టాయి. అయినా… అక్కడి ప్రభుత్వం చలించలేదు. చివరికి కేంద్రం చొరవ తీసుకోవాల్సివచ్చింది. మిగిలిన రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనే అమలు అవుతోందని, తమిళనాడులోనూ అదే కొనసాగాలని, ఈ విషయంలో తొందరపడవద్దని ఆదేశించింది.
తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో.. టాలీవుడ్ లోనూ ఆశలు చిగురించాయి. ఈ సంక్రాంతి లోగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటాయని భావించాయి. అయితే.. తమిళనాట సీన్ రివర్స్ అవ్వడంతో ఆ ఆశలు.. పూర్తిగా పోయినట్టే. ఇప్పుడు సంక్రాంతి కి వస్తున్న సినిమాలన్నీ 50 శాతం టికెట్లతో సరిపెట్టుకోవాల్సిందే.