స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఎప్పుడు నిర్వహించాలి.. ఏ తేదీల్లో పెట్టాలి.. అనేది ఆయన విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ… ఏపీలో వైసీపీ నేతలు… ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అనధికారికంగా తీసుకున్న వారు ఎప్పుడు నిర్వహిస్తామో… చెప్పేస్తున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల గురించి… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే.. ఇంతెత్తున లేచిన వైసీపీ నేతలు… ఇప్పుడు… ఏప్రిల్, మేలో నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి… ఈ మేరకు ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలు… ఏప్రిల్, మేలో జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చేసేది.. చేయించేది ఆయన పార్టీనే కాబట్టి.. ఆ విశ్వాసమే నిజం అని అనుకోవాలని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం.. మార్చితో ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రభుత్వానికి కరోనా సెకండ్ వేవ్.. కరోనా స్ట్రెయిన్ లాంటి సమస్యలు పెద్దగా ఉంటాయి. ఆయన రిటైరైన తర్వాత.. కనగరాజునో మరొకర్నో నియమించుకున్న తర్వాత పరిస్థితులు అన్నీ సానుకూలంగా కనిపిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా పూర్తిగా అంతమైపోతుంది ఏకగ్రీవాలతో ఎన్నికలను పూర్తి స్థాయిలో ఏకపక్షంగా నిర్వహించుకునే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకే.. విజయసాయిరెడ్డి ముందస్తుగానే స్థానిక ఎన్నికల గురించి.. చెబుతున్నారు.
తిరుపతి ఉపఎన్నిక మార్చిలోపు జరగాల్సి ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత వైసీపీ… స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల బాధ్యత తనపైనే ఉన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పకనే … ఎప్పుడు జరుగుతాయో ప్రకటించడం ద్వారా చెప్పుకున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.